యమహా మోటార్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘ఈసీ-06’ (EC-06)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రారంభ దశలో యమహా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను బ్లూయిష్ వైట్ అనే సింగిల్ కలర్ ఆప్షన్‌లో అందిస్తున్నారు.
డిజైన్
యమహా EC-06 చూడటానికి రివర్ ఇండీ లాగానే కనిపించినప్పటికీ, ఇందులో ప్రత్యేకమైన డిజైన్ డీటైల్స్ ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, రేక్డ్, మస్కులర్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో వంపులు తిరిగిన బాడీ ప్యానెల్స్‌తో ఆధునిక లుక్‌ను కలిగి ఉంది. రివర్ ఇండీతో పోలిస్తే, EC-06లో కాస్త తక్కువ 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు.
బ్యాటరీ, రేంజ్
ఈ స్కూటర్‌లో 4 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి 8.9 bhp పవర్, 26 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. EC-06 గరిష్ట వేగం గంటకు 79 కి.మీ., ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 169 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వారెంటీ ఇస్తోంది.
ఛార్జింగ్ & రైడింగ్ మోడ్స్
సాధారణ గృహ విద్యుత్ సాకెట్ ద్వారా ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఛార్జ్‌కు సుమారు 8 గంటలు పడుతుంది. EC-06లో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.
ఫీచర్లు
ఈ స్కూటర్‌లో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వేగం, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్‌లు, కనెక్టివిటీ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
సస్పెన్షన్ & బ్రేకులు
సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. ముందు, వెనుక 200 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) దీని ప్రత్యేకతగా కంపెనీ పేర్కొంది.


