బడ్జెట్‌ దెబ్బ.. కుప్పకూలిన మార్కెట్లు | Stock Market On 1st February 2026: Sensex, Nifty crashes as STT hike | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ దెబ్బ.. కుప్పకూలిన మార్కెట్లు

Feb 1 2026 4:48 PM | Updated on Feb 1 2026 4:59 PM

Stock Market On 1st February 2026: Sensex, Nifty crashes as STT hike

బడ్జెట్‌ 2026 దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ)ను 50-150 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన తరువాత మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుండి పారిపోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు ఆదివారం ప్రత్యేక సెషన్‌ తీవ్ర నష్టాలతో ముగించాయి.

ఫ్యూచర్ ట్రేడ్స్ పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,843 పాయింట్లు లేదా 2.23 శాతం 80,723 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 495 పాయింట్లు లేదా 1.96 శాతం నష్టపోయి 24,825 వద్ద నిలిచింది.

సెషన్‌లో అంతకుముందు సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు పడిపోయి 79,899.42 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.

విస్తృత మార్కెట్లు కూడా భారీ అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.7 శాతం నష్టపోయాయి. పెట్టుబడిదారులలో భయాన్ని సూచించే ఫియర్ గేజ్ - ఇండియా వీఐఎక్స్ దాదాపు 12 శాతం పెరిగింది.

రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు పడిపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 6 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2 శాతానికి పైగా క్షీణించాయి.

నిఫ్టీలోని 50 స్టాక్‌లలో భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. వాటి షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్‌లో ప్రముఖంగా ఉన్నాయి. మరోవైపు విప్రో, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ లాభాలను అందుకున్నాయి. ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement