డేటా సెంటర్ పెట్టుబడులపై స్పష్టత | Tax Relief for Tech Firms Clarity on Data Center Investments Budget 2026 | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్ పెట్టుబడులపై స్పష్టత

Feb 1 2026 4:19 PM | Updated on Feb 1 2026 4:28 PM

Tax Relief for Tech Firms Clarity on Data Center Investments Budget 2026

భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న పన్ను సంబంధిత అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చింది. క్లౌడ్ ఆధారిత సేవలు అందించే అంతర్జాతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.

పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పణ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థికశాఖ వివరాల ప్రకారం.. ‘ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై భారత్‌లో పన్ను విధించబోం. విదేశీ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది దేశానికి నికర ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. భారత్‌లో ఉన్న డేటా సెంటర్ కార్యకలాపాలకు మాత్రమే పన్ను వర్తిస్తుంది. సదరు సంస్థ తన సేవలను భారత్‌లోని రీసెల్లర్ ద్వారా విక్రయిస్తే, ఆ విక్రయాలపై వచ్చే ఆదాయానికి యథావిధిగా పన్ను విధిస్తారు’ అని తెలిపింది.

ఎందుకు ఈ నిర్ణయం?

క్లౌడ్ సేవలు అందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వందలాది డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. ఏ నిర్దిష్ట సెంటర్ వల్ల ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘గ్లోబల్ సంస్థలు భారతదేశంలో తమ సేవలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. పన్నుల భయంతో వారు వెనకడుగు వేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు

అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో మరిన్ని డేటా సెంటర్లను నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డేటా స్టోరేజ్ సామర్థ్యం పెరగడం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సరళీకృత నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి భరోసా ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలోని కీలక ప్రకటనలు

Advertisement
 
Advertisement
Advertisement