మార్కెట్‌ డకౌట్‌ | Investors lost Rs 9. 40 lakh cr in Budget Sunday crash | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ డకౌట్‌

Feb 2 2026 4:59 AM | Updated on Feb 2 2026 4:59 AM

Investors lost Rs 9. 40 lakh cr in Budget Sunday crash

బడ్జెట్‌ బౌన్సర్‌కి ఇన్వెస్టర్లు క్లీన్‌ బౌల్డ్‌! 

సెన్సెక్స్‌ 1,547 పాయింట్లు క్రాష్‌  

25,500 దిగువకు పతనమైన నిఫ్టీ 

ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ ఎస్‌టీటీ పెంపు 

ప్రమోటర్లపై అదనపు బైబ్యాక్‌ ట్యాక్స్‌ ప్రభావం  

రూ. 9.40 లక్షల కోట్ల సంపద ఆవిరి  

2026 బడ్జెట్‌ మ్యాచ్‌లో నిర్మలా సీతారామన్‌ వేసిన తొలి ఓవర్‌కే స్టాక్‌ మార్కెట్‌ డకౌట్‌ అయింది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ పై ఆర్థిక మంత్రి  వేసిన పన్నుల ఫుల్‌ టాస్‌కి బ్రోకరేజీలు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాయి. 

బడ్జెట్‌ రోజు స్టాక్‌ మార్కెట్‌ పాయింట్ల బ్యాటింగ్‌  చేస్తుందనుకుంటే నిర్మలా సీతారామన్‌ వేసిన అనూహ్య బౌన్సర్‌కు సెన్సెక్స్‌–నిఫ్టీ స్టంపులు ఎగిరిపోయాయి. ఓపెనింగ్‌ ఓవర్‌లోనే సెన్సెక్స్‌పై  భారీ అమ్మకాల యార్కర్ల దాడి జరిగింది. మిడ్‌ సెషన్‌కల్లా రెడ్‌ స్కోర్‌బోర్డ్‌ దడ పుట్టించింది.. ఇన్వెస్టర్లు డకౌట్‌ అయ్యి వెనుదిరిగితే, ఎల్‌బీడబ్లు్య అప్పీల్‌కి బుల్స్‌ చేతులు ఎత్తేశారు. బడ్జెట్‌ మ్యాచ్‌ లాభాల గెలుపుతో కాకుండా.. నష్టాల ఓటమి షాక్‌తో ముగిసింది.

న్యూడిల్లీ: నిర్మలమ్మ బడ్జెట్‌ స్టాక్‌ మార్కెట్‌పై ‘పన్నుల’ దాడి చేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ) 0.02% నుంచి 0.05 శాతానికి పెంచడం, కార్పొరేట్‌ ప్రమోటర్ల బైబ్యాక్‌లపై 22%, నాన్‌ కార్పొరేట్‌ ప్రమోటర్లపై 30% పన్ను విధింపు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచింది. కీలక మౌలిక రంగాలకు ఆశించిన స్థాయిలో మూలధన వ్యయాన్ని కేటాయించకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

 ఫలితంగా బడ్జెట్‌ రోజైన ఆదివారం సెన్సెక్స్‌ 1,547 పాయింట్లు క్షీణించి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 496 పాయింట్లు కుప్పకూలి 25 వేల స్థాయి దిగువన 24,825 వద్ద నిలిచింది. మార్కెట్‌ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.450 లక్షల కోట్లకు దిగివచ్చింది. 

ట్రేడింగ్‌ సాగిందిలా 
బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 82,389 వద్ద, నిఫ్టీ 25,334 వద్ద మొదలయ్యాయి. ఎస్‌టీటీ రద్దు, క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ మినహాయింపులపై ఆశలతో తొలిభాగంలో లాభాలు ఆర్జించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 457 పాయింట్లు పెరిగి 82,727 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 25,321 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. బడ్జెట్‌ ప్రసంగంలో పన్నుల ప్రతిపాదన మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచీలు క్షణాల్లో కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 2,371 పాయింట్లు క్షీణించి 79,899 వద్ద, నిఫ్టీ 549 పాయింట్లు కోల్పోయి 24,572 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. దిగువ స్థాయిల్లో కొంతమేర రికవరీ వచి్చనప్పటికీ.., సూచీలు భారీ నష్టాలతో 
ముగిశాయి. 

సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్ష 
‘‘బడ్జెట్‌లో ఎస్‌టీటీ, కార్పొరేట్‌ బైబ్యాక్‌లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు మార్కెట్‌ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ట్రేడింగ్‌ వ్యాపారంపై పన్నుల భారం పెరగడంతో భవిష్యత్‌లో వాల్యూమ్‌ తగ్గే అవకాశం ఉంది. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్షగా మారనుంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ’’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

మార్కెట్‌లో మరిన్ని అంశాలు
    ఎల్రక్టానిక్స్‌ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో రూ.40,000 కోట్ల ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్‌ తయారీ కంపెనీల షేర్లు వెలిగిపోయాయి. అత్యధికంగా సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ 6% లాభపడింది. డిక్సాన్‌ టెక్నాలజీస్‌ 4.21%, కేన్స్‌ టెక్నాలజీ 3.82%, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్స్‌ 2.95%, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ 2.06%, సైయంట్‌ డీఎల్‌ఎం 1 శాతం లాభపడ్డాయి.  

→ సెన్సెక్స్‌ 30 షేర్లలో టీసీఎస్‌(2%), ఇన్ఫోసిస్‌(1.17%), సన్‌ఫార్మా(0.95%), టైటాన్‌ (0.33%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ఎస్‌బీఐ(5.61%), అదానీపోర్ట్స్‌(5.53%), బీఈఎల్‌(5.36%), ఐటీసీ (3.91%), టాటా స్టీల్‌ (3.88%) õÙర్లు నష్టపోయాయి.  

→ ఒక ఐటీ షేర్లకు మాత్రమే స్వల్పంగా డిమాండ్‌ లభించింది. బీఎస్‌ఈలో రంగాల వారీ సూచీల్లో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5.60%, మెటల్‌ 3.85% క్షీణించాయి. కమోడిటీస్‌ 3.35%, ఇంధన 3.14%, క్యాపిటల్‌ గూడ్స్‌ 3.08%, వినిమయ 2.98%, 

→ ఇండ్రస్టియల్స్‌ 2.66%, విద్యుత్‌ 2.52% పతనమయ్యాయి. బీఎస్‌ ఈ స్మాల్, మిడ్‌క్యాప్‌ ఇండెక్సులు వరుసగా 3%, 2% పతనమయ్యాయి.  

→ ఎస్‌టీటీ పెంపు ప్రభావం బ్రోకరేజ్‌ కంపెనీల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ట్రేడింగ్‌ వాల్యూమ్‌ తగ్గుతుందనే ఆందోళనలతో ఈ రంగంలోని కీలక కంపెనీల షేర్లు 12% వరకు క్షీణించాయి. 

→ క్యూ3లో  లాభం 16% వృద్ధి నమోదుతో సన్‌ఫార్మా షేరు 1% పెరిగి రూ.1,610 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement