ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై! | IPO alert sebi green signal for 4 companies | Sakshi
Sakshi News home page

ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!

Dec 3 2025 7:24 AM | Updated on Dec 3 2025 7:33 AM

IPO alert sebi green signal for 4 companies

తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్‌ను సాధించగా.. ప్రైమరీ మార్కెట్లు సైతం ఈ కేలండర్‌ ఏడాది(2025) సరికొత్త రికార్డులవైపు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 96 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్ఛ్సేంజీలలో లిస్టయ్యాయి. గత మూడు నెలల్లోనే 40 కంపెనీలకుపైగా ఐపీవోకు రావడం విశేషం! ఇంతక్రితం 2024లో 94 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించి రికార్డ్‌ నెలకొల్పాయి. కాగా.. తాజాగా మరో 4 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధపడనున్నాయి. వివరాలు చూద్దాం..

ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిది. దీంతో రూ. 10,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలు చిక్కింది.

ఈ బాటలో మరో మూడు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లకు సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో పవరికా లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, అన్ను ప్రాజెక్ట్స్‌ చేరాయి. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ కంపెనీలు సెబీకి 2025 జూలై– సెప్టెంబర్‌ మధ్య కాలంలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి.  

ఈ నెలలోనే ఆఫర్‌ 
ప్రస్తుతం కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈ నెలలోనే పబ్లిక్‌ ఇష్యూకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ 49 శాతం వాటా కలిగి ఉంది.

ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సంస్థ ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌(యూకే) ఆఫర్‌ చేయనుంది. దీంతో ఐపీవో నిధులు ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌(ప్రమోటర్‌)కు చేరనున్నాయి. దేశీయంగా ఇప్పటికే నాలుగు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. లిస్టెడ్‌ ఏఎంసీలు.. హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్, శ్రీరామ్, నిప్పన్‌ లైఫ్‌ జాబితాలో ఐదో కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చేరనుంది.

పవర్‌ సొల్యూషన్స్‌.. 
పవర్‌ సొల్యూషన్స్‌ సమకూర్చే పవరికా లిమిటెడ్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 700 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు మరికొన్ని నిధులు కేటాయించనుంది.

వృథా నీటి సొల్యూషన్లు 
వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను ప్రమోటర్‌ సంస్థ కార్తకేయ కన్‌స్ట్రక్షన్స్‌ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 138 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.  

ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌లో 
ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌లో సేవలందిస్తున్న అన్ను ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా ఐపీవో చేపట్టనుంది. 2003లో అన్ను ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్ట్‌(ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌గా ఏర్పాటైన కంపెనీ తదుపరి అన్ను ప్రాజెక్ట్స్‌గా అవతరించింది.  మౌలిక రంగ సంబంధ డిజైన్, డెవలప్‌మెంట్, అభివృద్ధి, నిర్వహణ తదితర సరీ్వసులు సమకూర్చుతోంది.

వేక్‌ఫిట్‌ @ రూ. 185–195 
హోమ్, ఫర్నిషింగ్స్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 185–195 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 377 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 912 కోట్ల విలువైన 4.67 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లతోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూ 10న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 5న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూ తదుపరి ప్రమోటర్ల వాటా 43.7 శాతం నుంచి 37 శాతానికి దిగిరానున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామలింగెగౌడ వెల్లడించారు. ఈ నెల 15కల్లా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. కంపెనీ విలువ రూ. 6,400 కోట్లుగా నమోదయ్యే వీలుంది.

నిధుల వినియోగమిలా 
ఈక్విటీ జారీ నిధులలో రూ. 31 కోట్లు కొత్తగా 117 కోకో రెగ్యులర్‌ స్టోర్ల ఏర్పాటుకు, రూ. 15 కోట్లు మెషీనరీ తదితర కొనుగోళ్లకు, రూ. 161 కోట్లు లీజ్, సబ్‌లీజ్‌ అద్దెలుసహా ప్రస్తుత స్టోర్ల లైసెన్స్‌ ఫీజు చెల్లింపులకు వినియోగించనున్నట్లు వేక్‌ఫిట్‌ పేర్కొంది. మరో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ప్రకటనలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ప్రస్తుతం 130 స్టోర్లను నిర్వహిస్తున్న కంపెనీ వార్షికంగా 25–45 స్టోర్లను జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది.

2016లో ఏర్పాటైన కంపెనీ హోమ్, ఫర్నిషింగ్‌ మార్కెట్లో దేశీయంగా వేగవంత వృద్ధిని సాధిస్తోంది. 2024 మార్చి31కల్లా రూ. 1,000 కోట్లుపైగా ఆదాయం అందుకుంది. 2025 సెప్టెంబర్‌30కల్లా 6 నెలల్లో రూ. 724 కోట్ల టర్నోవర్, రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ సొంత చానళ్లు, కోకో స్టోర్లతోపాటు.. ఇతర ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు, మల్టీబ్రాండ్‌ ఔట్‌లెట్ల ద్వారా విభిన్న ఫర్నీచర్, ఫర్నిషింగ్స్‌ ప్రొడక్టులను విక్రయిస్తోంది. బెంగళూరు(కర్ణాటక), హోసూర్‌(తమిళనాడు), సోనిపట్‌(హర్యానా)లలో రెండేసి చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement