అగ్రరాజ్యం అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల దెబ్బతో ఆ దేశానికి భారత్ ఎగుమతులు గత 5 నెలల్లో గణనీయంగా క్షీణించాయి. అతి పెద్ద మార్కెట్‌కి ఎక్స్‌పోర్ట్స్ 28.5 శాతం తగ్గిపోయాయి. జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం గతేడాది మే–అక్టోబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి ఎగుమతులు 8.83 బిలియన్ డాలర్ల నుంచి 6.31 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
భారత్ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు ఏప్రిల్ 2న 10 శాతంతో మొదలుపెట్టి ఆగస్టు నాటికి 50 శాతానికి చేరాయి. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో అత్యధిక టారిఫ్‌లు వర్తిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. మరోవైపు పొరుగు దేశం చైనాపై టారిఫ్‌లు 30 శాతంగానే ఉండగా జపాన్‌పై కేవలం 15 శాతంగా ఉన్నాయి.
తాజా గణాంకాలు పరిశీలిస్తే టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తుల వాటా అక్టోబర్ ఎగుమతుల్లో 40.3 శాతం స్థాయిలో ఉన్నప్పటికి విలువపరంగా మే నెల నాటి 3.42 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2.54 బిలియన్ డాలర్లకు (25.8 శాతం) పడిపోయింది.


