అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు | Cognizant Research Shows Plug and Play AI is a Myth | Sakshi
Sakshi News home page

అందరికీ ఒకే ఏఐ పరిష్కారాలు సరిపోవు

Mar 15 2026 1:42 AM | Updated on Mar 15 2026 1:42 AM

Cognizant Research Shows Plug and Play AI is a Myth

సంస్థల అవసరాలకు అనుగుణంగా రూపొందించాల్సిందే 

కాగ్నిజెంట్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: కంపెనీల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ప్లగ్‌ అండ్‌ ప్లే (సిద్ధంగా ఉన్న) రకమైన సాధారణ సాఫ్ట్‌వేర్‌లు సరిపోవని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ వెల్లడించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి స్థాయి ఏఐ పరిష్కారాలను అందించే ఐటీ కంపెనీలకే ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. ఏఐపై నిర్ణయాధికారం కలిగిన 600 మందితోపాటు 38 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను సర్వే చేసి ఒక నివేదిక విడుదల చేసింది.

సంస్థలు ఏఐ భాగస్వామిని (టెక్నాలజీ సంస్థ) ఎంపిక చేసేటప్పుడు ధర లేదా సత్వర ఫలితాలు కంటే, తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ప్రత్యేక పరిష్కారాలు, విధానాలను కీలకంగా చూస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా అందుబాటులో ఉండే ఏఐ సాఫ్ట్‌వేర్‌లు తమ వ్యాపార అవసరాలకు సరిపోవంటూ కొన్ని సంస్థలు ఏఐ సేవలను తిరస్కరిస్తున్నాయని వెల్లడించింది. తగినంత అనుభవం లేకపోవడం, ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేయకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొంది.  

కీలక సవాళ్లు.. 
ఏఐ స్వీకరణలో సంస్థలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లలో.. నియంత్రణ, నిబంధనలపరమైన ఆందోళనలు.. పెట్టుబడిపై సరైన రాబడిని చూపించడం కష్టంగా ఉండడం.. ఏఐ వ్యూహంపై సరైన స్పష్టతలేమిని పేర్కొంది. ఏఐ విజయవంతం కావాలంటే ఒక్కో నమూనాను అమలు చేయడంతోనే సరిపోదని, సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ పేర్కొన్నారు. అలాగే ఏఐపై పెట్టుబడులను ప్రయోగాత్మకంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా సంస్థలు చూస్తున్నాయని తెలిపారు. ఏఐ మనుషుల పనులను వేగవంతం చేస్తుందే కానీ, వారి ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని కాగ్నిజెంట్‌ అధ్యయన నివేదిక పేర్కొంది. మనుషులు ఏఐ కలిసి పనిచేసే విధంగా పనితీరులో మార్పులు వస్తాయని తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement