డీల్ విలువ రూ. 3,270 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సర్విసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్‌కు చెందిన డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ కొనుగోలుని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 3,270 కోట్లు వెచ్చించింది. 2025 ఆగస్ట్ 21న డీటీఎస్‌ను సొంతం చేసుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. డీల్‌ను విజయవంతంగా ముగించడంతో తమ ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్‌లో విభాగంగా డీటీఎస్ పనిచేయనున్నట్లు విప్రో తెలియజేసింది.
డీటీఎస్ కొనుగోలు ద్వారా అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలు, ఇంజినీరింగ్ ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ నైపుణ్యాల పెంపుపై కంపెనీ కట్టుబాటులో మరో మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. డీటీఎస్‌లో 100 % వాటా కొనుగోలుకి విప్రో.. దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్‌కు చెందిన హర్మన్‌తో ఆగస్ట్‌లో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


