విప్రోకు కార్మిక చట్టాల సెగ  | Wipro Q3 net declines by 7percent to Rs3,119 crores | Sakshi
Sakshi News home page

విప్రోకు కార్మిక చట్టాల సెగ 

Jan 17 2026 4:08 AM | Updated on Jan 17 2026 4:08 AM

Wipro Q3 net declines by 7percent to Rs3,119 crores

క్యూ3 లాభం రూ. 3,119 కోట్లు 

ఆదాయం రూ. 23,556 కోట్లు 

షేరుకి రూ. 6 డివిడెండ్‌ 

రూ. 29,700 కోట్ల విలువైన డీల్స్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,119 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో చేపట్టిన రూ. 303 కోట్ల వన్‌టైమ్‌ కేటాయింపులు ప్రభావం చూపాయి. 

అంతేకాకుండా పునర్‌వ్యవస్థీకరణ పూర్తికావడంతో మరో రూ. 263 కోట్ల వ్యయాలు సైతం లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,354 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం ఎగసి రూ. 23,556 కోట్లకు చేరింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)తో పోలిస్తే నికర లాభం 4 శాతం నీరసించగా.. ఆదాయం 4 శాతం పుంజుకుంది. ఈ నెల 27 రికార్డ్‌ డేట్‌తో వాటాదారులకు షేరుకి రూ. 6 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. 

వృద్ధి ఓకే 
విప్రో తాజాగా ఐటీ సరీ్వసుల నుంచి పూర్తి ఏడాదికి 0–2 శాతం వృద్ధితో 263.5–268.8 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించగలమని అంచనా వేసింది.  ఏఐ వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పాలియా తెలియజేశారు. వెరసి డీల్స్‌ గెలుచుకోవడంలో విప్రో ఇంటెలిజెన్స్‌ ప్రత్యేకతను చాటుకుంటున్నట్లు వెల్లడించారు.   

ఇతర విశేషాలు 
→ క్యూ3లో 6 శాతం తక్కువగా 3.3 బిలియన్‌ డాలర్ల(రూ. 29,700 కోట్లు) విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది.  
→ 6,529 మంది ఉద్యోగులను జత కలుపుకుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 2,42,021ను తాకింది. 
→ తాజాగా 400 మంది ఫ్రెషర్స్‌(ఇప్పటివరకూ 5,000మంది)కి ఉపాధి కలి్పంచింది. తద్వారా ఈ ఏడాది చివరికి 8,000 మందిని తీసుకునే వీలున్నట్లు తెలియజేసింది. 
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 267 వద్ద ముగిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement