భారతదేశంలో డ్రైవర్‌లెస్ కారు.. ఇదేదో అంతర్జాతీయ కంపెనీ తయారు చేసిన కారు అనుకుంటే పొరపడినట్లే. టెక్నాలజీ, ఆవిష్కరణల్లో భారత్ దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా ఇటీవల దేశీయంగా డ్రైవర్‌లెస్ కారు ఆవిష్కరించారు. విరిన్(WIRIN) ప్రాజెక్ట్ పేరుతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro), ఆర్‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (RVCE) సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు(Driverless Car)ను ఆవిష్కరించారు.
సాధారణ ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేని ఇరుకైన, గుంతలతో నిండిన భారతీయ రోడ్లకు అనుగుణంగా అటానమస్ వాహనాన్ని రూపొందించడం పెద్ద సవాలు. ఈ కారు ఆవిష్కరణ భారతదేశపు రవాణా వ్యవస్థలో సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు ఒక ముఖ్యమైన ముందడుగుగా కొందరు భావిస్తున్నారు.
ప్రత్యేకతలివే..
విదేశీ అటానమస్ వాహనాలు భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేసేవి కావు. కానీ ఈ కొత్త కారును దేశీ రోడ్ల నిర్మాణానికి అనువుగా తయారు చేశారు.
రోడ్డుపై ఉంటే గుంతలు, ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా గుర్తించి, అందుకు అనువుగా స్పందించేలా రూపొందించారు.
ఈ WIRIN ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్‌లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వాహనం అడ్వాన్స్‌డ్ సెన్సార్ల సహాయంతో రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారులు, ఇతర అడ్డంకులను గుర్తించి, సురక్షితంగా ప్రయాణించగలదని తయారీదారులు తెలిపారు.
ఈ డ్రైవర్‌లెస్ కారు రూపకల్పనకు ఆరేళ్లు సమయం పట్టింది. దీన్ని అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ 2019లో విప్రో, ఐఐఎస్‌సీ మధ్య సహకారంతో మొదలైంది. ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థుల బృందం ఇంజినీరింగ్, రూపకల్పన సహాయాన్ని అందించింది. అటానమస్ డ్రైవింగ్ కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ ట్రాఫిక్ నమూనాల నుంచి నిరంతరం నేర్చుకునేలా మెషిన్ లెర్నింగ్ వ్యవస్థను తీర్చిదిద్దారు. కెమెరాలు, సెన్సార్ల నుంచి వచ్చే దృశ్య డేటాను విశ్లేషించి పరిసరాలను అర్థం చేసుకునేలా విజువల్ కంప్యూటింగ్‌ను ఉపయోగించారు.
🚨 India’s first driverless car has been unveiled by IISc, Wipro, and RV College in Bengaluru. pic.twitter.com/AlnNvnAPkc
— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2025
ఈ వాహనం ప్రస్తుతం పరీక్ష దశలో(Testing Phase) ఉంది. పరిశోధకులు భారతీయ రోడ్ పరిస్థితులను పూర్తిగా మ్యాపింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ డ్రైవర్‌లెస్ టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: యూఎస్‌లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు


