అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిలిపివేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H-4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025 (గురువారం) లేదా ఆ తర్వాత తమ ఈఏడీను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై స్వయంచాలకంగా(ఆటోమెటిక్‌గా) ఈఏడీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల ఈఏడీని పొడిగించనున్నట్లు చెప్పారు.
ఈఏడీ అంటే..
అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసే పత్రం. దీన్ని సాధారణంగా ఫారం I-766 / EAD కార్డు అంటారు. ఈ కార్డు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం యూఎస్‌లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఉపయోగపడుతుంది.
జాతీయ భద్రతే లక్ష్యం
గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి స్టార్‌లింక్ సర్వీసుల డెమో


