ట్రంప్‌ గోల్డ్‌ కార్డు వచ్చేసింది | Usa President Donald Trump launched gold card visa | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ గోల్డ్‌ కార్డు వచ్చేసింది

Dec 12 2025 3:56 AM | Updated on Dec 12 2025 3:56 AM

Usa President Donald Trump launched gold card visa

వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే రూ.9.02 కోట్లు  

కంపెనీలు కొనాలంటే రూ.18.03 కోట్లు  

నాన్‌ రీఫండబుల్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.13.54 లక్షలు  

వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తుకు అవకాశం  

గోల్డ్‌ కార్డుతో శాశ్వత నివాసిత హోదా, పౌరసత్వం  

న్యూయార్క్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్‌ గోల్డ్‌ కార్డు’ వీసా పథకం అమల్లోకి వచ్చింది. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్‌ కార్డు విక్రయాలను ప్రారంభించారు. ఇందుకోసం trumpcard. gov అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తర్వాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కలి్పంచే ఈ కార్డు ధర మిలియన్‌ డాలర్లు(రూ.9.02 కోట్లు). 

అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులు వ్యక్తిగతంగా లేదా విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయొచ్చు. కంపెనీల మాత్రం రెండు మిలియన్ల డాలర్లు(రూ.18.03 కోట్లు) చెల్లించాలి. గోల్డ్‌ కార్డు కోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రాసెసింగ్‌ ఫీజు కింద 15,000 డాలర్లు(రూ.13.54 లక్షలు) చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్‌లైన్‌లోనే మిలియన్‌ డాలర్ల రుసుము చెల్లించవచ్చు. 

అమెరికాలో అతి తక్కువ సమయంలో నివాసిత హోదా, తద్వారా పౌరసత్వం పొందాలంటే ‘ట్రంప్‌ గోల్డ్‌ కార్డు’ కొనుగోలు చేయడం చక్కటి మార్గమని ప్రభుత్వం వెల్లడించింది. కార్డు విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో అమెరికా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. ట్రంప్‌ గోల్డ్‌ కార్డు అనేది నిజానికి ఒక వీసా లాంటిదే. నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలో ఉద్యోగాల్లో నియమించుకోవడం, వారు ఇక్కడే ఉండిపోయే అవకాశం కల్పించడం, పౌరసత్వం ఇవ్వడం, అమెరికా అభివృద్ధి కోసం వారి సేవలు ఉపయోగించుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.  

విదేశీ నిపుణులు రావడం ఒక బహుమతి  
గోల్డ్‌ కార్డు వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తంచేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉద్యోగాలు పొందవచ్చని, ఇక్కడే ఉండిపోవచ్చని సూచించారు. గ్రీన్‌ కార్డు కంటే గోల్డ్‌ కార్డు అత్యత్తమమైనదని స్పష్టంచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు.

 ట్రంప్‌ బుధవారం మధ్యాహ్నం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ, డెల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ మైఖేల్‌ డెల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా గోల్డ్‌ కార్డులు కొనుగోలు చేయొచ్చని ట్రంప్‌ సూచించారు. అమెరికాలో చదువుకుంటున్న భారత్, చైనా విద్యార్థులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. విదేశీ నిపుణులు అమెరికాకు రావడం, అమెరికా ప్రగతి కోసం పనిచేయడాన్ని ఒక బహుమతిగా భావిస్తామని చెప్పారు.   

సమస్య ఏమిటో తెలిసింది..
యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌తోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులతో తనకు ఎదురైన అనుభవాన్ని ట్రంప్‌ పంచుకున్నారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని, వారిని ఉద్యోగాల్లో నియమించుకోలేకపోతున్నామని, వారంతా అమెరికాలోనే ఉండేలా చూడాలని టిమ్‌ కుక్‌ తనను కోరారని తెలిపారు. అసలైన సమస్య ఏమిటో తనకు తెలిసిందని చెప్పారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు.

సొమ్ము చేసుకోవడానికేనా? 
ఇండియాలో హెచ్‌1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను ఐదారు నెలలపాటు వాయిదా వేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను, వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్టుమెంట్‌ ప్రకటించింది. వేలాది మంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. తదుపరి షెడ్యూల్‌ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే డొనాల్డ్‌ ట్రంప్‌ గోల్డ్‌ కార్డు విక్రయాలకు తెరతీయడం గమనార్హం. 

అధిక డిమాండ్‌ ఉన్న హెచ్‌1బీ వీసా నిబంధనలను ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మరోవైపు విదేశీయులను ఆకర్శించడానికి గోల్డ్‌ కార్డు వీసాను తీసుకొచి్చంది. గోల్డ్‌ కార్డు పేరిట భారీగా సొమ్ము చేసుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడమే ట్రంప్‌ సర్కార్‌ అసలు లక్ష్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లాటినం వెర్షన్‌ కార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని ధర 5 మిలియన్ల డాలర్లు. కంపెనీలు ఈ కార్డు కొంటే కొన్ని రకాల పన్ను రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి. త్వరలో ఈ కార్డు అందుబాటులోకి రానుంది.

ఐదేళ్ల తర్వాత పౌరసత్వం: హోవార్డ్‌ లుట్నిక్‌   
గోల్డ్‌ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ వెల్లడించారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే మిలియన్‌ డాలర్లు, కంపెనీలు దరఖాస్తు చేస్తే రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ కార్డు కొనుగోలు చేసినవారు ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే అమెరికాలో ఉండడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయొచ్చని అన్నారు.  

కార్డు ఎన్ని రోజుల్లో రావొచ్చు..
గోల్డ్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి కార్డు చేతికి అందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. దరఖాస్తు రుసుము 15,000 డాలర్లు నాన్‌ రీఫండబుల్‌. అంటే గోల్డ్‌ కార్డు వచి్చనా రాకున్నా ఈ సొమ్ము వెనక్కి తిరిగిరాదు. కార్డు వచి్చన వారికి అమెరికాలో చట్టబద్ధమైన పరి్మనెంట్‌ రెసిడెంట్‌ స్టేటస్‌ కల్పిస్తారు. ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాదారుల హోదా లభిస్తుంది. అసాధారణమైన, అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారికి ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాలు ఇస్తుంటారు. ట్రంప్‌ గోల్డ్‌ కార్డు కొంటే పరోక్షంగా ఈబీ–1 లేదా ఈబీ–2 వీసా పొందినట్లే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement