ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ చర్చించారు. ఉమ్మడి, లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించారు.
కాగా, భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయని కల్పించుకుని దాన్ని నివారించానంటూ తాజాగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. మంగళవారం(డిసెంబర్ 9) పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం!
కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు.
మరోవైపు, భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో సంభాషించిన సంగతి తెలిసిందే. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఇరువురు అగ్రనేతలు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మోదీ, నెతన్యాహు మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంభాషణ సాగినట్లు ఇజ్రాయెల్ పీఎంవో పేర్కొంది.


