ట్రంప్ నోట మళ్లీ అదే పాట
న్యూయార్క్, పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయి. కల్పించుకుని దాన్ని నివారించా‘ అన్నారు. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! మంగళవారం పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను.
కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు.
నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాల నుంచి అమెరికాకు రారెందుకంటూ వాపోయారు. గత ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులతో పొట్టన పెట్టు కోవడం, అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి దాయాది పీచమణచడం తెలిసిందే. చివరికి పాక్ కాళ్ల బేరానికి రావడంతో శాంతి కుదిరింది. అదంతా తన ఘనతేనని అప్పట్లోనే ట్రంప్ చెప్పు కున్నారు. అదేమీ లేదని భారత్ అప్పుడే కొట్టిపారేసింది. కేవలం ఇరు దేశాల చర్చలతోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేసింది.


