భారీ తారలు. మన సూర్యుని కంటే ఏకంగా పది వేల రెట్లు పెద్దవి! పైగా నిన్నా మొన్నటికి కూడా కావవి! తొలి విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) జరిగిన కొన్ని కోట్ల ఏళ్ల వ్యవధిలోనే పుట్టుకొచ్చాయి. అంటే అతి పురాతన నక్షత్రాలన్నమాట. ఇలాంటివి ఈ అనంత విశ్వంలో ఉన్నాయనింతకాలం సైంటిస్టులు అనడమే తప్పించి ఇదమిత్థంగా తేల్చిచెప్ దాఖలాలు మాత్రం లేవు. అలాంటి తొలినాళ్ల భారీ తారల ఉనికికి సంబంధించి పక్కా రుజువులను మానవాళి తాలూకు అతి పెద్ద అంతరిక్ష నేత్రం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా ఒడిసిపట్టింది..!
దొరికాయిలా...
ఈ భారీ తారలను రాకాసి నక్షత్రాలుగా సైంటిస్టులు ముద్దు పిలుచుకుంటూ ఉంటారు. వాటి పరిమాణే అందుకు కారణం. సూర్యునితో పోలిస్తే అవి కనీసం 1,000 నుంచి 10,000 రెట్లు పెద్దవి మరి! జీఎస్ 3073 అనే అతి సుదూర నక్షత్ర మండలంలోని రసా యనిక అవశేషాలను జేమ్స్ వెబ్ తాజాగా పట్టించింది. వాటిని అనంతరం ఈ రాకాసి తారల ఉనికిని సైంటిస్టులు అసందిగ్ధంగా నిర్ధారించారు.
పురాతన క్రిష్ణ బిలాలకూ మూలమివే
సృష్టి ఆవిర్భావం జరిగిన కొన్ని కోట్ల ఏళ్లకే అతి భారీ కృష్ణ బిలాలు ఊపిరి పోసుకున్నాయి. ఇందుకు ఎన్నో రుజువు కూడా దొరికాయి. అదెలా సాధ్యపడిందీ అనే సందేహా లకు కూడా ఈ తొలినాళ్ల రాకాసి తారల ఉనికితో సమా దానం దొరికినట్టయింది.
ఇలా అధ్యయనం..
తొలి తరల ఉనికి కోసం సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్, హార్వర్డ్, స్మిత్సోని యన్, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకో సం తొలుత జీఎస్ 3073 నక్షత్ర మండలంలోని నైట్రోజన్ – ఆక్సిజన్ నిష్పత్తిని అవి లెక్కగట్టి 0.46గా తేల్చాయి. సాధారణ తారలతో కూడిన గెలాక్సీల్లో ఇంతటి నిష్పత్తి అక్షరాలా అసాధ్యం. జీఎస్ 3073లో వందలాది కోట్ల ఏళ్ల క్రితమే భారీ, అంటే రాకాసి తారలు మనుగడ సాగించాయని దీన్నిబట్టి వర్సిటీల బృందం తేల్చింది. ‘తొలినాళ్ల రాకాసి తారలు నిజమేనా అని 20 ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధానికి ఈ అధ్యయనం తెర దించింది. ఇందుకు సంబంధించిన తొలి పక్క రుజువులు జీఎస్ 3073లో చిక్కాయి‘ అని అధ్యయన బృంద సారథి డానియల్ వాలెన్ హర్షం వెలిబుచ్చారు. వీటిని తొలి తరం తారలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఆసక్తికర అధ్యయన ఫలితాలను ఆస్ట్రో ఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురించారు.
కొసమెరుపు
జీఎస్ 3037 గెలాక్సీ కేంద్ర స్థానంలో ప్రస్తుతం సూపర్ నోవాలను కూడా తలదన్నే అతి భారీ కృష్ణబిలం ఉందట. అది బహుశా కచ్చితంగా తొలి తరం రాకాసి తార తాలూకు రూపాంతరమే అయి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


