1ఐ-ఔముమువా ఊహా చిత్రం. త్రీఐ-అట్లాస్ కూడా ఇలాగే ఉంటుంది.
ఐదు కిలోమీటర్ల పొడవు
ఇతర తోకచుక్కలకు భిన్నమైన మార్గం
గ్రహాంతర వాసుల నౌక?
శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు
హార్వార్డ్ ప్రొఫెసర్ అవీ లోయెబ్‌తో సాక్షి టీవీ సంచలన ఇంటర్వ్యూ! (లింక్ దిగువన)
గ్రహాంతర వాసులు ఉన్నారా?...
యుగాలుగా సాగుతున్న ఈ చర్చ...
ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కారణం?
ఎక్కడో ఖగోళ దూరాల నుంచి సూర్యుడివైపునకు దూసుకొస్తున్న ‘త్రీఐ-అట్లాస్’!
ఏమిటిది? గ్రహాంతర వాసులకు దీనికి సంబంధం ఏమిటి? చూసేయండి...
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నాలుగు నెలల క్రితం ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. చిలీలోని అట్లాస్ అబ్జర్వేటరీ (వేధశాల) సుదూర విశ్వం నుంచి ఓ భారీ ఆకారం చాలా వేగంగా ప్రయాణిస్తూండటాన్ని గుర్తించింది. దానికి ‘త్రీఐ-అట్లాస్’ అని నామకరణం చేసింది. తోకచుక్కల్లాంటి ఖగోళ వస్తువులను గుర్తించడం నాసాకు కొత్త కాదు. గతంలోనూ ‘1ఐ-ఔముమువా’, ‘2ఐ-బోరిసోవ్’ అనే రెండు ఖగోళ వస్తువులను గుర్తించింది. అయితే వీటితో పోలిస్తే... త్రీఐ-అట్లాస్ వ్యవహారం కొంచెం తేడాగా ఉండటంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగింది. మరిన్ని పరిశోధనలు చేపట్టారు. చాలా విషయాలు తెలిశాయి. మిస్టరీ మరింత పెరిగింది. గ్రహాంతర వాసుల నౌక ఏమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే...
త్రీఐ-అట్లాస్ ప్రయాణిస్తున్న కక్ష్యను బట్టి చూస్తే ఇది కచ్చితంగా సౌర కుటుంబం అవతల పుట్టినదని స్పష్టమైంది. సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు దీని వేగం మరింత పెరిగి సెకనుకు 68.3 కిలోమీటర్లకు చేరింది. గత నెల 29న సూర్యుడికి 20.4 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. త్రీఐ-అట్లాస్ చాలా ప్రత్యేకమైందని చెప్పేందుకు ఇవేవీ కారణం కాదు..
మంచు, దుమ్ము, రాళ్లతో తయారయ్యే తోకచుక్కల వెంబడి దుమ్ము, ధూళిలతో కూడిన ప్రాంతం కొంత ఉంటుంది. దీన్నే మనం తోక అంటూ ఉంటాం. సాధారణంగా అన్ని తోకచుక్కల తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి కానీ త్రీఐ-అట్లాస్ తో సూర్యుడి వైపు ఉండటం విశేషం. రాకెట్ లాంటిది ప్రయాణిస్తోందా? లేక ఇంజిన్ నుంచి వెలువడే పొగలాంటిదా? అని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీని స్పీడ్ పెరుగుతున్న తీరును గురుత్వాకర్షణ శక్తితో వివరించలేకపోవడం. ఆక్సిలరేటర్‌పై కాలు పెడితే వాహనం స్పీడు పెరిగినట్లుగా అన్నమాట. దీన్నిబట్టి త్రీఐ-అట్లాస్‌ను ఎవరో నడుపుతున్నారని అనిపిస్తోందని, సహజసిద్ధంగా ఇలా జరిగేందుకు అవకాశం లేదని నాసా గెలిలియో ప్రాజెక్టు అధ్యక్షుడు, ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లియోబ్ చెబుతున్నారు.
చివరగా... సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న త్రీఐ-అట్లాస్‌లో కార్బన్ మోనాక్సైడ్, నీటి ఆవిరి చాల ఎక్కువగా ఉందని, సూర్యూడి నుంచి చాలా దూరంగా ఉన్నా.. బాగా వెలిగిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ తోకచుక్కల కంటే భిన్నం ఈ రెండు లక్షణాలు. అంతేకాదు... ఇది సౌర కుటుంబం కంటే పాతది కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
గ్రహాంతర వాసులదేనా?
త్రీఐ-అట్లాస్ గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌక అయ్యేందుకు అవకాశాలు ఎక్కువని అవి లోయెబ్ అంటున్నారు లోయెబ్ స్కేల్‌లో తాను త్రీఐ-అట్లాస్‌కు ‘నాలుగు’ మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతర వాసులపై మరోసారి చర్చ మొదలైంది. త్రీఐ-అట్లాస్ వింత ప్రవర్తన, తయారైన తీరులను బట్టి ఇది మానవాతీత టెక్నాలజీ ఆవిష్కరణగానే చూడాలని కొందరు వాదిస్తూంటే.. మరికొందరు ఇలాంటి ఆకారాలు ఖగోళం మీద సహజమేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయో.. జీవం ఆవిర్భావానికి అవసరమైన కీలక మూలకలు విశ్వం మొత్తమ్మీద ఎలా వ్యాపించి ఉన్నాయో తెలుసుకునేందుకు.. గ్రహాలను దాటి ప్రయాణించడమెలా అన్న ప్రశ్నకు ఈ త్రీఐ-అట్లాస్ కొన్ని సమాధానాలు ఇవ్వవచ్చునని శాస్త్రవేత్తల అంచనా... త్రీఐ-అట్లాస్‌ను మీరూ చూడాలనుకుంటున్నారా..??? కనీసం ఎనిమిది అంగుళాల టెలిస్కోపు ద్వారా ఈ నెల మధ్య నుంచి ఆఖరు వరకూ తెల్లవారుఝామున తూర్పు దిక్కులో మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా చూసేయండి!
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.


