చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న వేళ వాషింగ్టన్, డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది. తైవాన్‌తో 11బిలియన్ డాలర్ల భారీ డీల్ చేసుకుంది. ఒక ద్వీపానికి ఇంత పెద్దమెుత్తంలో ఆయుధాలు అమ్మడం యూఎస్ చరిత్రలో ఇదే తొలిసారని ఆదేశ వర్గాలు తెలిపాయి. ఈడీల్‌తో చైనా-యుఎస్ మధ్య సంబంధాలు మరోసారి భగ్గుమనే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ సమయంలో పన్నులు పెంచుతాడో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో డ్రాగన్ కంట్రీతో ట్రేడ్ వార్‌కు దిగారు. ఈ పన్నుల యుద్ధం కొంత తగ్గి ఇప్పుడిప్పుడే రెండు దేశాల బంధాలు కొలిక్కి వస్తన్నాయనే తరుణంలో ట్రంప్ మరో బాంబు పేల్చారు.
చైనా తమ భూభాగంగా ప్రకటిస్తున్న తైవాన్‌తో, అమెరికా, 11 బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రి అమ్మకానికి ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌లో ఆధునాతన రాకెట్ సిస్టమ్స్, యాంటీ టాంక్ మిస్సైల్స్, డ్రోన్స్ లాంటి అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నట్లు పెంటగాన్ ప్రకటించింది. తైవాన్ తన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని యుఎస్ తెలిపింది.
ఈ భారీ ఒప్పందంపై తైవాన్ స్పందించింది. తమకు ఇంత భారీ మెుత్తంలో ఆయుధ సరఫరా చేస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలని తైవాన్ అధికారులు తెలిపారు. తన జాతీయ భద్రతను కాపాడడంలో ఎటువంటి రాజీపడేది లేదని వారు ప్రకటించారు. ఇటీవలే ఆయుధ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 40 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ ప్రకటించినట్లు తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా ఖండించింది. ఈ ఆయుధాల ఒప్పందంతో తైవాన్‌లో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని తెలిపింది.
చైనా దేశం తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమే అని ఆరోపిస్తుంది. అయితే తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర పరిపాలన ప్రాంతంగా ప్రకటించుకుంటుంది. ఈ నేపథ్యంలో తరచుగా వివాదం చెలరేగుతుంది.


