బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మత దూషణ ఆరోపణలతో హిందూ మతానికి చెందిన ఓ యవకుడ్ని కొట్టి చంపి.. దహనం చేశారు. రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాలో మళ్లీ కల్లోలం చెలరేగగా.. హిందూ యువకుడి హత్య ఆ అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లైంది.
ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మైమన్‌సింగ్ జిల్లా భాలూకా ఉపజిల్లాలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్‌పై గురువారం రాత్రి మూక దాడి జరిగింది. కొందరు దుండగులు అతణ్ని మతపరంగా దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. ఆపై చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు. అనంతరం రహదారి పక్కన పడేశారు. మళ్లీ కొందరు ఆ మృతదేహానికి నిప్పు అంటించడం.. కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఈ ఘటనను బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ఎక్స్ వేదికగా స్పందించారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. ఉస్మాన్ హాది మతసామరస్యం కోసం పాటు పడ్డాడని.. కాబట్టి శాంతియుతంగా ఉండాలని అతని అనుచరులకు యూనస్ పిలుపు ఇచ్చారు. మయమన్‌సింగ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని.. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
భారత వ్యతిరేకి అయిన రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. హిందూ యువకుడి మూక హత్య మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. స్క్వేర్ మాస్టర్‌బరీ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు దీపూ చంద్ర దాస్. అయితే..
ఇస్లాంకు వ్యతిరేకంగా అతను వ్యాఖ్యలు చేశాడంటూ స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు మత వ్యతిరేక నినాదాలు చేస్తూ అతన్ని ఫ్యాక్టరీ ఆవరణలోనే చితకబాది.. అతి కిరాతకంగా హత్య చేసి హైవేపై అతని మృతదేహాన్ని తగలబెట్టారు. తన కుటుంబానికి ఏకైక ఆధారం తన కొడుకేనంటూ.. అలాంటోడిని భయానకంగా చంపారంటూ జరిగిన ఘటనను వివరిస్తూ దాస్ తండ్రి రవిలాల్ కంటతడి పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటనపై భారత్‌లో పలువురు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు సహా ఇతర మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను దాడి చేసి చంపడం దారుణం. నాగరిక సమాజంలో మతం, కులం, గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస, హత్యలు జరగడం మానవత్వానికి వ్యతిరేకమైన నేరం. బంగ్లాదేశ్‌లో హిందూ, క్రైస్తవ, బౌద్ధ మైనారిటీలపై పెరుగుతున్న హింసను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. వాళ్ల భద్రత, రక్షణ అంశాన్ని ఢాకాతో బలంగా ప్రస్తావించాలి అని అన్నారామె.
ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘1971లో భారత సైన్యం చేసిన త్యాగాలను చరిత్ర గుర్తుంచుకుంటుంది. అప్పట్లో సుమారు 3,900 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, 10,000 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ పుట్టుక కోసం వారు పోరాడారు. కానీ నేడు అదే నేలపై నిరపరాధ మైనారిటీల రక్తం కారడం బాధాకరం. ప్రస్తుతం అక్కడ శాంతి అనే పదం మాటల్లో మాత్రమే కనిపిస్తోంది.. వాస్తవంలో మైనారిటీలపై హింస కొనసాగుతోంది. బంగ్లాదేశ్ హిందూ–బౌద్ధ–క్రైస్తవ ఐక్య మండలి నివేదిక ప్రకారం.. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 2,400కి పైగా మైనారిటీలపై దాడులు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అన్యాయంగా జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ నేత ప్రదీప్ భౌమిక్ లించింగ్.. ఇప్పుడు దీపు చంద్ర దాస్ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కేవలం ఖండనలతో ఆగిపోకుండా, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, యునైటెడ్ నేషన్స్ (UN) మైనారిటీల పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు.
జిహాదీల ఉత్సవం అది..
బహిష్కృత బంగ్లాదేశ్ రచయిత, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ ఈ ఉదంతంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ పథకం ప్రకారమే.. దీపు దాస్ హత్య జరిగిందని అన్నారామె. దీపు చంద్ర దాస్ మరో మతాన్ని కించపరిచాడన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఫ్యాక్టరీలో సహోద్యోగితో జరిగిన గొడవతో అతన్ని బలి పశువు చేశారు. తప్పుడు ప్రచారంతో అతనిపై మూక దాడి జరిగింది. పోలీసులు అతన్ని రక్షించి కస్టడీలోకి తీసుకున్నప్పటికీ.. చివరికి మళ్లీ వాళ్ల చేతికి అప్పగించారు. తాను అమాయకుడినని దీపు ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అతన్ని ఉరి వేసి, కాల్చేసి “జిహాదీ ఉత్సవం” జరిపింది. దీపు తన కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉన్నాడు. అతని సంపాదనతో వికలాంగ తండ్రి, తల్లి, భార్య, చిన్నారి జీవనం సాగించేవారని ఆమె చెప్పారు. ఇప్పుడు కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో, నేరస్తులను ఎవరు శిక్షిస్తారో ప్రశ్నించారు? అని అన్నారామె.
భారతీయులకు ఇప్పటికే హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు ఇప్పటికే భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ‘‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి’’ అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు. అయితే భాలూకా ఘటనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.


