ఈసారి మంత్రి వంతు! | Hindu leader dies under suspicious in Bangladesh | Sakshi
Sakshi News home page

ఈసారి మంత్రి వంతు!

Feb 7 2026 6:40 PM | Updated on Feb 8 2026 5:57 AM

Hindu leader dies under suspicious in Bangladesh

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హిందువుల మరణాలు

కస్టడీలో మాజీ మంత్రి రమేశ్‌ చంద్రసేన్‌ అనుమానాస్పద మృతి

ఢాకా: పదవీచ్యుత షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక బంగ్లాదేశ్‌లో హిందువులపై మూకదాడులు సర్వసాధారణమైపోగా ఇప్పుడా బాధితుల జాబితాలో ఏకంగా కేంద్ర మాజీ మంత్రి చేరిపోయారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. అవామీ లీగ్‌ నేత, సీనియర్‌ హిందూ నాయకుడు రమేశ్‌ చంద్రసేన్‌ శనివారం పోలీస్‌ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. 

విద్యార్థి సంఘాలు, అతివాద కూటముల సారథ్యంలో మొహమ్మద్‌ యూనుస్‌ నేతృత్వంలో కొలువుతీరిన తాత్కాలిక ప్రభుత్వం ఇన్నాళ్లూ అధికార పార్టీగా కొనసాగిన అవామీ లీగ్‌ నేతలనూ లక్ష్యంగా చేసుకుందన్న వాదనలకు తాజాగా చంద్రసేన్‌ మరణం మరింత బలం చేకూర్చింది. హత్య, ఇతర ఆరోపణలపై జల వనరుల శాఖ మాజీ కేంద్ర మంత్రి రమేశ్‌ను అరెస్ట్‌చేసి దినాజ్‌పూర్‌ జిల్లా జైలుకు తరలించిన యూనుస్‌ ప్రభుత్వం ఆయనకు ఉద్దేశపూర్వకంగా జైలుగదిలో కనీస సౌకర్యాలు కల్పించలేదని గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. 

వైద్య వసతులు లేకపోవడంతో 85 ఏళ్ల రమేశ్‌ తీవ్ర అనారోగ్యంపాలయ్యారని, చివరకు శనివారం ఉదయం ప్రాణాపాయ స్థితిలో దినాజ్‌పూర్‌ వైద్యబోధనాస్పత్రికి తరలించినా కేవలం పావుగంటకే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సాధారణ హిందువులపై బెదిరింపులు, చోరీల వంటి తప్పుడు ఆరోపణలతో చితకబాది, నిప్పంటించి అల్లరిమూకలు చంపేస్తుంటే యూనుస్‌ సర్కార్‌ ఇలా హిందూ నేతలను కస్టడీలో ప్రాణాలు తీస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రమేశ్‌ బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో ఐదుసార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. 

రమేశ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు అవామీ లీగ్‌ నేతలను కస్టడీలోనే చంపేశారని బంగ్లాదేశీయులు త సామాజిక మాధ్యమాల్లో వార్తలను షేర్‌చేస్తున్నారు. ‘‘ రమేశ్‌ అజాత శత్రువు. ఎంతో మందికి సాయపడ్డారు. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ ముఖ్యనేత మిర్జా ఫక్రూల్‌ ఇస్లాం ఆలాంగిర్‌ను ఎదిరించి రమేశ్‌ పెద్ద నేతగా ఎదిగారు. అది వాళ్లకు నచ్చలేదు. ఇలాంటి నేతనూ అతివాద తాత్కాలిక సర్కార్‌ పొట్టనపెట్టుకుంది. నేతలనే కాదు సాధారణ అవామీలీగ్‌ కార్యకర్తలు వేలాదిగా ఇటీవల బలయ్యారు. 2024 ఆగస్ట్‌లో హసీనా ప్రభుత్వం గద్దెదిగాక ఈ హత్యల పరంపర మొదలైంది’’ అని బంగ్లాదేశ్‌లో కంటెంట్‌ క్రియేటర్‌ ప్రదీప్‌ చౌదరి తన ‘ఫేస్‌బుక్‌’ ఖాతాలో రాసుకొచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement