breaking news
alien life
-
సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో...
గ్రహాంతర వాసులు ఉన్నారా?...యుగాలుగా సాగుతున్న ఈ చర్చ...ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కారణం?ఎక్కడో ఖగోళ దూరాల నుంచి సూర్యుడివైపునకు దూసుకొస్తున్న ‘త్రీఐ-అట్లాస్’!ఏమిటిది? గ్రహాంతర వాసులకు దీనికి సంబంధం ఏమిటి? చూసేయండి...అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నాలుగు నెలల క్రితం ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. చిలీలోని అట్లాస్ అబ్జర్వేటరీ (వేధశాల) సుదూర విశ్వం నుంచి ఓ భారీ ఆకారం చాలా వేగంగా ప్రయాణిస్తూండటాన్ని గుర్తించింది. దానికి ‘త్రీఐ-అట్లాస్’ అని నామకరణం చేసింది. తోకచుక్కల్లాంటి ఖగోళ వస్తువులను గుర్తించడం నాసాకు కొత్త కాదు. గతంలోనూ ‘1ఐ-ఔముమువా’, ‘2ఐ-బోరిసోవ్’ అనే రెండు ఖగోళ వస్తువులను గుర్తించింది. అయితే వీటితో పోలిస్తే... త్రీఐ-అట్లాస్ వ్యవహారం కొంచెం తేడాగా ఉండటంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగింది. మరిన్ని పరిశోధనలు చేపట్టారు. చాలా విషయాలు తెలిశాయి. మిస్టరీ మరింత పెరిగింది. గ్రహాంతర వాసుల నౌక ఏమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే...త్రీఐ-అట్లాస్ ప్రయాణిస్తున్న కక్ష్యను బట్టి చూస్తే ఇది కచ్చితంగా సౌర కుటుంబం అవతల పుట్టినదని స్పష్టమైంది. సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు దీని వేగం మరింత పెరిగి సెకనుకు 68.3 కిలోమీటర్లకు చేరింది. గత నెల 29న సూర్యుడికి 20.4 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. త్రీఐ-అట్లాస్ చాలా ప్రత్యేకమైందని చెప్పేందుకు ఇవేవీ కారణం కాదు.. మంచు, దుమ్ము, రాళ్లతో తయారయ్యే తోకచుక్కల వెంబడి దుమ్ము, ధూళిలతో కూడిన ప్రాంతం కొంత ఉంటుంది. దీన్నే మనం తోక అంటూ ఉంటాం. సాధారణంగా అన్ని తోకచుక్కల తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి కానీ త్రీఐ-అట్లాస్ తో సూర్యుడి వైపు ఉండటం విశేషం. రాకెట్ లాంటిది ప్రయాణిస్తోందా? లేక ఇంజిన్ నుంచి వెలువడే పొగలాంటిదా? అని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీని స్పీడ్ పెరుగుతున్న తీరును గురుత్వాకర్షణ శక్తితో వివరించలేకపోవడం. ఆక్సిలరేటర్పై కాలు పెడితే వాహనం స్పీడు పెరిగినట్లుగా అన్నమాట. దీన్నిబట్టి త్రీఐ-అట్లాస్‌ను ఎవరో నడుపుతున్నారని అనిపిస్తోందని, సహజసిద్ధంగా ఇలా జరిగేందుకు అవకాశం లేదని నాసా గెలిలియో ప్రాజెక్టు అధ్యక్షుడు, ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లియోబ్ చెబుతున్నారు. చివరగా... సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న త్రీఐ-అట్లాస్‌లో కార్బన్ మోనాక్సైడ్, నీటి ఆవిరి చాల ఎక్కువగా ఉందని, సూర్యూడి నుంచి చాలా దూరంగా ఉన్నా.. బాగా వెలిగిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ తోకచుక్కల కంటే భిన్నం ఈ రెండు లక్షణాలు. అంతేకాదు... ఇది సౌర కుటుంబం కంటే పాతది కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులదేనా?త్రీఐ-అట్లాస్ గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌక అయ్యేందుకు అవకాశాలు ఎక్కువని అవి లోయెబ్ అంటున్నారు లోయెబ్ స్కేల్లో తాను త్రీఐ-అట్లాస్‌కు ‘నాలుగు’ మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతర వాసులపై మరోసారి చర్చ మొదలైంది. త్రీఐ-అట్లాస్ వింత ప్రవర్తన, తయారైన తీరులను బట్టి ఇది మానవాతీత టెక్నాలజీ ఆవిష్కరణగానే చూడాలని కొందరు వాదిస్తూంటే.. మరికొందరు ఇలాంటి ఆకారాలు ఖగోళం మీద సహజమేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయో.. జీవం ఆవిర్భావానికి అవసరమైన కీలక మూలకలు విశ్వం మొత్తమ్మీద ఎలా వ్యాపించి ఉన్నాయో తెలుసుకునేందుకు.. గ్రహాలను దాటి ప్రయాణించడమెలా అన్న ప్రశ్నకు ఈ త్రీఐ-అట్లాస్ కొన్ని సమాధానాలు ఇవ్వవచ్చునని శాస్త్రవేత్తల అంచనా... త్రీఐ-అట్లాస్‌ను మీరూ చూడాలనుకుంటున్నారా..??? కనీసం ఎనిమిది అంగుళాల టెలిస్కోపు ద్వారా ఈ నెల మధ్య నుంచి ఆఖరు వరకూ తెల్లవారుఝామున తూర్పు దిక్కులో మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా చూసేయండి!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
‘ఆ మర్మాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేము’
ఆకాశంలో ఎగురుతూ దర్శనమిచ్చిన(యూఎఫ్‌వో) ఘటనలపై దర్యాప్తు ఫలితాన్ని.. శుక్రవారం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది. ఈ నివేదికపై ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఏదో చెబుతాయనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడాయి నిఘా వర్గాలు. అవి ఏంటో అనే విషయంపై ఎలాంటి నిర్ధరాణకు రాలేదని సింపుల్‌గా తేల్చి చెప్పాయి. వాషింగ్టన్: వరుసగా యూఎఫ్‌వో ఘటనలు.. అది కూడా మిలిటరీ ఎయిర్‌స్పేస్‌లోనే దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రక్షణ దళాల్ని ఆదేశించింది అమెరికన్ పార్లమెంట్(కాంగ్రెస్). దీంతో కిందటి ఏడాది ఆగష్టులో యూఎపీటీఎఫ్(Unidentified Aerial Phenomena Task Force)ను ఏర్పాటు చేయించింది పెంటగాన్. అటుపై 2004 నుంచి 144 ఘటనలపై నివేదికలు తెప్పించుకుని.. వాటిపై మళ్లీ నిఘా వర్గాలతో దర్యాప్తు చేయించి తుది నివేదికను తయారు చేయించింది. అయితే సుదీర్ఘ విచారణ, దర్యాప్తుల తర్వాత వాటిపై అంచనాకి రాలేకపోయామని తేల్చేసింది. శత్రుదేశాల పనికాదు! వేల పేజీల రిపోర్టులను పరిశీలించి.. సింపుల్‌గా కొన్నిపేజీల(పదిలోపే) ఫలితాన్ని ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఆ వీడియోల్లో కనిపించినవి వేరే గ్రహానికి చెందినవని, ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవని చెప్పడానికి నిఘా వర్గాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాగని రష్యా, చైనాలాంటి దాయాది దేశాల సాంకేతిక పన్నాగమూ అని కూడా నిర్ధారణ కాలేదు’’ అని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఆ మర్మాలకు సంబంధించి ఒక నిర్ధారణకు మాత్రం ఇప్పటికిప్పుడే రాలేమని, అలాగని ప్రచారపు సిద్ధాంతాలను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పెంటగాన్ ప్రకటించడం విశేషం. కొత్తగా ఏముందంటే.. శోధించి.. పరిశీలించి.. జాబితాను రూపొందించినట్లుగా పెంటగాన్ ప్రకటించడంపై సెటైర్లు పడుతున్నాయి. పైగా పెంటగాన్ ఇప్పుడు తుది నివేదిక ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదన్నది చాలామంది మాట. అయితే పదకొండు ఘటనల్లో మాత్రం దాదాపుగా ‘ఢీ కొట్టేంత పని చేశాయన్న పైలెట్ల వివరణ’ను ప్రకటించడం మాత్రం కొత్తేనని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, గ్రహాంతర విషయాలపై ఆసక్తికనబరిచే పరిశోధకులు. పైగా వాటి ఆకారాలపై కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం(విమానాల తరహాలోనే ఉన్నప్పటికీ.. బెలూన్ల షేప్ ఆకారాలు వాటికి తగిలించి ఉన్నాయని) పరిశోధనలో ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక యూఎఫ్వోకి బదులు యూఏపీ(Unidentified Aerial Phenomena) ప్రతిపాదనను బలపరచడం, కిందటి ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ నేవీ రిలీజ్ చేసిన వీడియోల్ని పరిగణిస్తున్నామని ప్రకటించడం ద్వారా యూఎఫ్‌వో థియరీలను ఇంకా సజీవంగానే ఉంచాలని పెంటగాన్ భావిస్తోందని తెలుస్తోంది. -
గ్రహాంతర జీవులు ఉండొచ్చు: నాసా
మనం నివసిస్తున్న భూమికి ఓ చంద్రుడు ఉన్నట్లే.. శనిగ్రహానికి కూడా ఎన్సెలాడస్ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. దానిమీద నీళ్లు ఉన్నట్లు కూడా తేలింది. ఇప్పుడు ఆ చంద్రుడి మీద గ్రహాంతర వాసులు ఉండే అవకాశం కచ్చితంగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతోంది. శనిగ్రహాన్ని పరిశీలించేందుకు నాసా ఎప్పటినుంచో దృష్టి కేంద్రీకరించింది. ఎన్సెలాడస్ మీద ఉన్న మంచు కింద నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి నమూనాలను సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని బట్టి చూస్తే అక్కడ జీవం ఉందని తెలుస్తోందని, సాధారణ జీవులు మీథేన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయని కూడా శాస్త్రవేత్తలు వివరించారు. సూక్ష్మజీవులు ఉపయోగించుకునే రసాయన ఇంధన వనరులు అక్కడ ఇప్పటికే కనిపించాయని, అయితే అక్కడ ప్రస్తుతానికి ఫాస్పరస్, సల్ఫర్ మాత్రం కనిపించలేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త హంటర్ వైట్ తెలిపారు. బహుశా అవి చాలా తక్కువమొత్తంలో ఉండటం వల్లే కనపడకపోవచ్చని, తాము మళ్లీ అక్కడకు వెళ్లి జీవానికి సంబంధించిన ఆనవాళ్లను కూడా చూడాల్సి ఉందని చెప్పారు. ఎన్సెలాడస్ మీద బ్యాక్టీరియా లాంటి చిన్న జీవులు ఉండే అవకాశం ఉందని, అసలు వేరే గ్రహం మీద జీవాన్ని కనుక్కోవడమే చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. భూమ్మీద జీవానికి కావల్సినవన్నీ ఎలా ఉన్నాయో.. శనిగ్రహపు చంద్రుడి మీద కూడా అచ్చం అలాగే ఉన్నాయని నాసా శాస్త్రవేత్త లిండా స్పిల్కర్ వివరించారు. వాస్తవానికి మన చంద్రుడితో పోలిస్తే ఎన్సెలాడస్ చాలా చిన్నది. చంద్రుడిలో సుమారు 15 శాతం పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అంత చిన్న చంద్రుడి మీద జీవానికి కావల్సిన రసాయన ఇంధనం ఉందన్న నిర్ధారణ భూగ్రహానికి వెలుపల జీవం మీద జరుగుతున్న పరిశోధనలో చాలా పెద్ద మైలురాయి అని ఆమె చెప్పారు. -
ఆ రెండు కొత్త గ్రహాల్లో ఎలియన్స్!
ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా రెండు కొత్త గ్రహాలను కనుగొన్నారు. ఈ కొత్త గ్రహాల ఉనికితో మన సౌర వ్యవస్థ సరిహద్దులు మరింత విస్తృతమయ్యే అవకాశముందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర గ్రహాల్లోనూ జీవం ఉనికి ఉందా? అని ఎన్నాళ్లుగానో సాగుతున్న అన్వేషణలో ఈ రెండు కొత్త గ్రహాలు పెద్ద ముందడుగు అయ్యే అవకాశముందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండు కొత్త గ్రహాల్లో ఒకటి మన సౌర వ్యవస్థ అంచుల్లో ఉండగా.. మరొకటి దానికి మరికొంత దూరంలో ఉంది. ఈ రెండు కొత్త గ్రహాల ఉనికి ఖగోళ పరిశోధనలో పెద్ద మలుపు అని పరిశీలకులు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాల్లో జీవం ఉందని చెప్పడానికి ఈ రెండు కొత్త గ్రహాలు అవకాశమివ్వొచ్చని ఆస్ట్రేలియా కాన్‌బెర్రాలోని మౌంట్ స్ట్రోమ్లో అబ్జర్వేటరీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త బ్రాడ్ టక్కర్ వ్యాఖ్యానించారు. ఈ గ్రహాలను కనుగొనడం.. విశ్వంలో మరో భూమిని కనుగొనడం లాంటిదేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భూమి మీద మాత్రమే జీవం ఉందని, ఈ నేపథ్యంలో భూమిలాంటి గ్రహంలోనే జీవం ఉండే అవకాశముందని భావించవచ్చునని తెలిపారు. సౌరవ్యవస్థ అంచుల్లో ఉన్న నూతన రాతి గ్రహానికి శాస్త్రవేత్తలు జీజే 1132బీగా నామకరణం చేశారు. సౌర వ్యవస్థ అంచుల్లో ఉన్న ఈ గ్రహం అత్యంత కీలకమైందని, ఇతర గ్రహాలతో పోలిస్తే.. ఇది సమీపంలో ఉండటంతో దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు విశేషమైన పరిశోధనలు చేసే అవకాశముందని మేరిల్యాండ్ యూనివర్సిటీ ఖగోళ నిపుణుడు డ్రాక్ డిమింగ్ 'నేచర్' జర్నల్‌కు రాసిన లేఖలో తెలిపారు.


