గ్రహాంతర జీవులు ఉండొచ్చు: నాసా

గ్రహాంతర జీవులు ఉండొచ్చు: నాసా


మనం నివసిస్తున్న భూమికి ఓ చంద్రుడు ఉన్నట్లే.. శనిగ్రహానికి కూడా ఎన్‌సెలాడస్‌ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. దానిమీద నీళ్లు ఉన్నట్లు కూడా తేలింది. ఇప్పుడు ఆ చంద్రుడి మీద గ్రహాంతర వాసులు ఉండే అవకాశం కచ్చితంగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతోంది. శనిగ్రహాన్ని పరిశీలించేందుకు నాసా ఎప్పటినుంచో దృష్టి కేంద్రీకరించింది. ఎన్‌సెలాడస్‌ మీద ఉన్న మంచు కింద నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి నమూనాలను సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌ లాంటి వాయువులు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని బట్టి చూస్తే అక్కడ జీవం ఉందని తెలుస్తోందని, సాధారణ జీవులు మీథేన్‌ను తీసుకుని కార్బన్‌ డయాక్సైడ్‌ను వదులుతాయని కూడా శాస్త్రవేత్తలు వివరించారు.సూక్ష్మజీవులు ఉపయోగించుకునే రసాయన ఇంధన వనరులు అక్కడ ఇప్పటికే కనిపించాయని, అయితే అక్కడ ప్రస్తుతానికి ఫాస్పరస్‌, సల్ఫర్‌ మాత్రం కనిపించలేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్‌వెస్ట్‌ రీసెర్చ్‌​ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త హంటర్‌ వైట్‌ తెలిపారు. బహుశా అవి చాలా తక్కువమొత్తంలో ఉండటం వల్లే కనపడకపోవచ్చని, తాము మళ్లీ అక్కడకు వెళ్లి జీవానికి సంబంధించిన ఆనవాళ్లను కూడా చూడాల్సి ఉందని చెప్పారు. ఎన్‌సెలాడస్‌ మీద బ్యాక్టీరియా లాంటి చిన్న జీవులు ఉండే అవకాశం ఉందని, అసలు వేరే గ్రహం మీద జీవాన్ని కనుక్కోవడమే చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. భూమ్మీద జీవానికి కావల్సినవన్నీ ఎలా ఉన్నాయో.. శనిగ్రహపు చంద్రుడి మీద కూడా అచ్చం అలాగే ఉన్నాయని నాసా శాస్త్రవేత్త లిండా స్పిల్కర్‌ వివరించారు. వాస్తవానికి మన చంద్రుడితో పోలిస్తే ఎన్‌సెలాడస్‌ చాలా చిన్నది. చంద్రుడిలో సుమారు 15 శాతం పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అంత చిన్న చంద్రుడి మీద జీవానికి కావల్సిన రసాయన ఇంధనం ఉందన్న నిర్ధారణ భూగ్రహానికి వెలుపల జీవం మీద జరుగుతున్న పరిశోధనలో చాలా పెద్ద మైలురాయి అని ఆమె చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top