
ల్యాబ్‌లో తదుపరి పరీక్షలు చేయనున్న సైంటిస్టులు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని లద్ధాఖ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) పంపించిన రెండు రకాల పంటల విత్తనాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) సైంటిస్టులు విజయవంతంగా మళ్లీ భూమిపైకి చేర్చారు. వీటిని కొన్నాళ్లు పరీక్షించి, పొలంలో నాటబోతున్నారు. లద్ధాఖ్‌లో చలి ప్రాంతంలో సాగయ్యే పౌష్టికాహార పంటలైన సీబక్‌థోర్న్, హిమాలయన్ బక్‌వీట్ అనే పంటల విత్తనాలను ఈ నెల 1వ తేదీన నాసా క్రూ–11 మిషన్ ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేర్చారు.
ఈ విత్తనాలు సరిగ్గా వారం రోజులపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నాయి. క్రూ–10 మిషన్ ద్వారా ఈ నెల 9వ తేదీన భూమిపైకి తిరిగి తీసుకొచ్చారు. ‘ఎమర్జింగ్ స్పేస్ నేషన్స్ స్పేస్ ఫర్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఫర్ స్పేస్’ అనే ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విత్తనాలు ఎలాంటి మార్పులకు లోనవుతాయి? అనేది పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతరిక్షంలో భూమ్యాకర్షణ శక్తి ఉండదు.
రేడియేషన్ అధికం. ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తరచుగా మారిపోతుంటాయి. సీబక్‌థోర్న్, హిమాలయన్ బక్‌వీట్ లద్ధాఖ్‌లో సంప్రదాయ పంటలు. పోషకాలు పుష్కలం. వైద్య అవసరాలకు కూడా ఉపయోగిస్తుంటారు. బాగా చల్లగా ఉండే వాతావరణంలో సాగవుతాయి. అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకొనే పంటల పరీక్ష కోసం వీటినే ఎంపిక చేశారు.
లద్ధాఖ్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన మొదటి పంటలుగా రికార్డుకెక్కాయి. ఇక ఈ విత్తనాలను ల్యాబ్‌లో విశ్లేషించబోతున్నారు. వాటిలో జన్యుపరమైన మార్పులేమైనా జరిగాయా? అనేది గుర్తిస్తారు. అవి ఎంతమేరకు ఉత్పత్తిని ఇస్తాయి అనేది పరీక్షిస్తారు. అంతరిక్ష వాతావరణాన్ని ఇవి తట్టుకోగలవని తేలితే భవిష్యత్తులో అంతరిక్షంలో ఈ పంటలను సాగు చేసే అవకాశం ఉందని, తద్వారా వ్యోమగాములు ఆహార అవసరాలు తీరుతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష–వ్యవసాయ రంగంలో భారతదేశ ప్రాధాన్యతను సీబక్‌థోర్న్, హిమాలయన్ బక్‌వీట్ విత్తనాలు చాటిచెబుతున్నాయి. ఐఎస్‌ఎస్ నుంచి వచ్చిన కొన్ని విత్తనాలను తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తుండగా, మరికొన్నింటిని లద్ధాఖ్ ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తామని ప్రోటోప్లానెట్ సంస్థ డైరెక్టర్ సిద్ధార్థ్ పాండే చెప్పారు.