గుల్మార్గ్‌లో ప్రారంభించిన సీఎం ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యా టక ప్రాంతం గుల్మార్గ్‌లో ఆసియాలోనే అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్ ఏర్పాటైంది. దీనిని శనివారం సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. స్కైయింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న గుల్మార్గ్‌లో దీనివల్ల స్కైయింగ్ మౌలికవసతులు మరింతగా మెరుగయ్యాయని సీఎం చెప్పారు. అంతర్జాతీయ వింటర్ స్పోర్ట్స్ మ్యాప్‌లో గుల్మార్గ్ కూడా చేరినట్లయిందని చెప్పారు.
బారాముల్లా జిల్లా కొంగ్‌డొరి వద్ద రూ.3.65 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ స్కై డ్రాగ్ లిఫ్టు పొడవు 726 మీటర్లు. పైన వేలాడుతున్న కదిలే బార్‌ను పట్టుకుని బోర్డుపై నిలబడిన వ్యక్తిని ఇది ఎత్తయిన ప్రదేశంపైకి లాక్కెళుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా గుల్మార్గ్‌లోని అఫ్ఫర్వాత్‌లో ఏర్పాటైన ప్రపంచంలోనే ఎత్తయిన రివాల్వింగ్ మల్టీపర్సస్ హాల్‌ను కూడా ప్రారంభించారు.
గుల్మార్గ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.17 కోట్లతో నెలకొల్పిన పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. అదేవిధంగా, వింటర్ ట్రెయినింగ్ వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కైయింగ్ ట్రెయినింగ్ అడ్వంచర్ టూరిజమ్ సెంటర్‌ను, ఇంటిగ్రేటెడ్ స్కై ట్రెయినింగ్ కోర్సులను కూడా ఆయన ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంలో గుల్మార్గ్‌కు ప్రముఖ స్థానం ఉందని సీఎం ఒమర్ చెప్పారు. పూర్తిస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అ త్యాధునిక, అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం పెట్టుబడుల అవసరముందని తెలిపారు. దీనివల్ల ఏడాదంతా పర్యాటక రంగ అవకాశాలుండటంతోపాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.


