నక్సలిజం నల్లతాచు పడగనీడలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు
సాయుధ వామపక్ష ఉద్యమం నిరుపయోగం
శాంతి మాత్రమే అభివృద్ధి బాటల్ని పరుస్తుంది
మార్చి 31కల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తాం
ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పునరుద్ఘాటన
రాయపూర్: నక్సలిజం నల్లతాచు పడగనీడ కారణంగా దేశంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ఆయన ప్రతిజ్ఞచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కేంద్రం జగ్‌దల్పూర్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగిన బస్తర్ ఒలింపిక్–2025 క్రీడోత్సవ ముగింపు వేడుకలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
‘‘ఆయుధం చేతబట్టిన నక్సలైట్లు నక్సలిజం పేరుతో సాధించింది ఏమీ లేదు. నక్సలిజం అనేది ఇటు సాయుధులకు ఉపయోగపడలేదు. అటు గిరిజనులకూ అక్కరకు రాలేదు. సాయుధ భద్రతాబలగాలకూ ఎలాంటి ప్రయోజనంలేని పనికిమాలిన పనిగా నక్సలిజం తయారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీలోపు దేశంలో నక్సలిజంను అంతం చేస్తాం. ఏడు జిల్లాల సమాహారంగా ఉన్న బస్తర్ రీజియన్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుదాం.
ఇకనైనా సీపీఐ(మావోయిస్ట్) ఉద్యమకారులు ఆయుధాలు విడనాడి సమాజ ప్రధాన స్రవంతితో కలిసి నడవాలి. దారితప్పిన యువతను పునరావాస పథకం ద్వారా మళ్లీ గాడినపెడతాం. గౌరవప్రద జీవితం గడిపే అవకాశం కల్పిస్తాం. ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడాలంటే ఒక్క శాంతితోనే సాధ్యం. బస్తర్ ఒలింపిక్–2024 చూడ్డానికి వచ్చా. ఈసారి కూడా బస్తర్ ఒలింపిక్–2025 వీక్షించేందుకు విచ్చేశా.
వచ్చే ఏడాది బస్తర్ ఒలింపిక్–2026 చూడ్డానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమేకాదు యావత్ భారతావని నుంచి దానిని తరిమేస్తాం. 2026 మార్చి 31కల్లా దేశవ్యాప్తంగా ఎరుపు ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇది త్వరలో సిద్ధించనుంది. నక్సలిజాన్ని రూపుమాపడమే మా పనికాదు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే మా కర్తవ్యం. నక్సలిజం శకం ముగిసి నూతన అభివృద్ధి శకం త్వరలో ఆరంభమవుతుంది’’అని అమిత్ వ్యాఖ్యానించారు.
మరో ఐదేళ్లలో అద్భుతాభివృద్ధి
‘‘బస్తర్ రీజియన్‌లో కాంకేర్, కొండగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతేవాడ జి ల్లాలున్నాయి. వెనుకబడిన ఈ 7 గిరిజన జిల్లాలను వచ్చే ఐదేళ్లలో అంటే 2030 డిసెంబర్‌కల్లా దేశంలోనే అత్యంత అభివృద్ధిబాటలో పయనించిన జిల్లాలుగా మార్చేస్తా. ఛత్తీస్‌గఢ్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఈ ఏడు జిల్లాల కోసం శతథా కృషిచేస్తాయి. అర్హులకు ఇళ్లతోపాటు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటగ్యాస్ కనెక్షన్, ఐదు కేజీల ఉచిత రేషన్ బియ్యం, ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాది రూ.5లక్షల దాకా ఉచితవైద్య సదుపాయం కల్పిస్తాం. ఏడు జిల్లాల మధ్య రహదారుల ద్వారా అనుసంధానతను పెంచుతాం. విద్యుత్ స్తంభాలు వేయించి అందరి ఇళ్లలో విద్యుత్ వెలుగుల్ని ప్రసరింపజేస్తాం’’అని అన్నారు.
ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం
‘‘ప్రతి ఒక్క గిరిజన గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల పటిష్ట నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తాం. అటవీ ఉత్పత్తులను శుద్ధిపరిచే కర్మాగారాలను సహకారసంఘాల సహకారంతో నెలకొల్పుతాం. ఇతర గిరిజన జిల్లాలతో పోలిస్తే అత్యధిక పాల ఉత్పత్తికేంద్రాలుగా ఈ ఏడు జిల్లాలను తీర్చిదిద్దుతాం. పాడి, కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఇక్కడి రైతుల కుటుంబాదాయాన్ని రెట్టింపుచేస్తాం’’అని అన్నారు.
కొత్త పరిశ్రమలను తీసుకొస్తాం
‘‘నూతన పరిశ్రమలను ఈ జిల్లాలకు తీసుకొస్తాం. ఉన్నత విద్యా కేంద్రాలను నెలకొల్పుతాం. దేశంలోనే అత్యుత్తమమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం. బస్తర్ పట్టణంలో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిని కడతాం. గిరిజన ప్రాంతాలను పట్టిపీడిస్తున్న పోషకాహార లోప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త పథకాన్ని తీసుకొస్తాం. మావోయిస్టుల హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి, లొంగిపోయిన మావోయిస్టుల కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం’’అని అన్నారు.
అప్పుడు రణగొణలు.. ఇప్పుడు గణగణలు
‘‘ఒకప్పుడు నక్సలైట్ల మందుపాతరల పేల్చివేతలు, బుల్లెట్ల మోత, రణగొణలే వినిపించేవి. ఇప్పుడు రుధిర దారుల్లో విద్యాసుమాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాలయాలను నిర్మించాం. అందుకే నాటి రణగొణలు పోయి ఇప్పుడు బడిగంటల గణగణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది సుదూర స్వప్నంగా మారిన ఈ ప్రాంతంలో కొత్తగా రోడ్లు, రైల్వేలు, హైవేలు తీసుకొస్తున్నాం.
అప్పట్లో ఇక్కడ లాల్ సలామ్ అనే నినాదమే వినిపించేది. ఇప్పుడంతా భారత్ మాతా కీ జై నినాదమే మార్మోగిపోతోంది. బస్తర్ అభివృద్ధికి మేమంతా కట్టుబడ్డాం. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీప్రభుత్వం కొలువుతీరాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని కూకటివేళ్లలో పెకిలించడం మొదలెట్టాయి. అందుకే ఎన్నో పరస్పర కాల్పుల ఘటనలు జరిగాయి. చాలా మంది నక్సలైట్లు చనిపోయారు. ఆ భయంతోనే గత రెండేళ్లలో ఏకంగా 2,000 మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు’’అని అమిత్ షా అన్నారు.


