శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో వాణిజ్యం విషయమై జమ్ముకశ్మీర్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్ఓసీ భారత్‌లో భాగమే కాబట్టి నియంత్రణ రేఖ ద్వారా విభజించిన కశ్మీర్‌లోని రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని దిగుమతి-ఎగుమతి కాకుండా అంతర్-రాష్ట్ర వాణిజ్యంగా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, ఫిబ్రవరి 14, 2019న జరిగిన పుల్వామా కారు బాంబు దాడిలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణల కారణంగా ఎల్‌ఓసీలో భారత్ వాణిజ్యాన్ని నిలిపివేసింది. 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుండి 2019లో వాణిజ్యం నిలిపివేసే వరకు ఎల్ఓసీ గుండా జరిగిన వాణిజ్యంలో ఇన్‌వర్డ్, అవుట్‌వర్డ్ సరఫరాల కోసం, శ్రీనగర్‌లోని సీజీఎస్టీ సూపరింటెండెంట్ కేంద్ర వస్తువులు, సేవల పన్ను చట్టం 2017 కింద తమకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను పిటిషనర్లు సవాలు చేశారు.
దీంతో, జమ్ముకశ్మీర్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ సంజయ్ పరిహార్ ధర్మాసనం..‘ప్రస్తుతం పాకిస్తాన్ వాస్తవ నియంత్రణలో ఉన్న ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో భాగమే. అందువల్ల, ప్రస్తుత కేసులో, సరఫరాదారుల స్థానం, వస్తువుల సరఫరా స్థలం అప్పటి జమ్ము కశ్మీర్‌లోనే ఉన్నాయి. అందువల్ల, పన్ను కాలంలో పిటిషనర్లు ప్రభావితం చేసిన క్రాస్-ఎల్‌ఓసీ వాణిజ్యం అంతరాష్ట్ర వాణిజ్యం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే క్రాస్-ఎల్‌ఓసీ వాణిజ్యం అంతర్గత వాణిజ్యం మాత్రమే. ఇది వస్తువుల దిగుమతి లేదా ఎగుమతి కాదు’ అని స్ఫష్టం చేసింది.
2008లో భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్‌లోని ఉరి, జమ్మూలోని పూంచ్ పాయింట్ల ద్వారా క్రాస్-ఎల్‌ఓసీ వాణిజ్యం ప్రారంభమైనప్పుడు వాణిజ్యాన్ని విలువ ఆధారిత పన్నులు 2005 ద్వారా నిర్వహించారు. ఈ చట్టం వాణిజ్యాన్ని సున్నా-పన్ను వాణిజ్యంగా మార్చింది. ఇది కరెన్సీ మార్పిడి లేకుండా వస్తు మార్పిడి ప్రాతిపదికన జరిగింది. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినపుడు ఇది ఈ వాణిజ్యానికి పన్ను మినహాయింపును అందించలేదు. అయితే, పిటిషనర్లు క్రాస్-ఎల్‌ఓసీ వాణిజ్యాన్ని జీరో రేటెడ్ అమ్మకంగా పరిగణించడం కొనసాగించారు. తమ రిటర్న్‌లో వారి క్రాస్-ఎల్‌ఓసీ లావాదేవీలను సూచించలేదు. అమ్మకపు పన్ను చెల్లించలేదు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పిటిషనర్లు కోర్టులో సవాలు చేశారు.


