శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో ఆపరేషన్ సింధూర్ జరిగే అవకాశం ఉంటుందేమోనని అన్నారు. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ బాంబు దాడిపై స్పందిస్తూ.. ఆ వైద్యులు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?. దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్ర సంబంధాలు ఉన్న వైద్యులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో దాడి కోసం వైద్యులు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?. కారణం ఏమిటి? అనే ప్రశ్నలను బాధ్యులను అడగాలి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో మరో ఆపరేషన్ సిందూర్ వంటి కార్యక్రమం జరగకూడదని ఆశిస్తున్నాను.
ఆపరేషన్ సిందూర్ వల్ల ఏమీ రాలేదు. మనవాళ్లు 18 మంది మరణించారు. రెండు దేశాలు (భారత్, పాకిస్తాన్) తమ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను ఆశిస్తున్నాను. అదొక్కటే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. స్నేహితులను మార్చవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేమంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పిన మాటలను తాను పునరావృతం చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో స్నేహమేంటి? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
మరోవైపు.. శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటనపై ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ.. అధికారులు పేలుడు పదార్థాలను సరిగా నిర్వహించలేదు. ఇది మనం చేసుకున్న తప్పు. పేలుడు పదార్థాల గురించి అవగాహన ఉన్నవారు వాటిని ఎలా నిర్వహించాలో అధికారులతో మాట్లాడి ఉండాల్సింది. అలా చేయకుండా వారే స్వయంగా నిర్వహించడానికి ప్రయత్నించారు అని విమర్శించారు. జరిగిన నష్టాన్ని అందరూ చూశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అక్కడ ఇళ్లకు చాలా నష్టం జరిగిందన్నారు.


