ముకేశ్- షమీ- ఆకాశ్ దీప్ (PC: CAB X)
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో బెంగాల్ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యర్థి జట్టును 63 పరుగులకే ఆలౌట్ చేశారు. దేశీ వన్డే టోర్నీ గ్రూప్-బిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
శుభారంభం అందించిన షమీ
కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ నమ్మకాన్ని నిలబెడుతూ బెంగాల్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్ టాపార్డర్‌లో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (0)ను డకౌట్ చేసి.. టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ శుభారంభం అందించాడు.
షమీకి తోడుగా టీమిండియా స్టార్లు ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ నిప్పులు చెరుగుతూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వన్‌డౌన్‌లో వచ్చిన మురుగన్ అశ్విన్ (0)ను ఆకాశ్ దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓపెనర్ శుభం ఖజూరియా (12)ను ముకేశ్ వెనక్కి పంపాడు.
చెలరేగిన ముకేశ్, ఆకాశ్
ఇక యావర్ హసన్ (1) రూపంలో షమీ తన రెండో వికెట్ తీయగా.. కెప్టెన్ పారస్ డోగ్రా (19) సహా అబ్దుల్ సమద్ (8), యుధ్‌వీర్ సింగ్ చరక్ (7) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ముకేశ్ కుమార్.. రిధమ్ శర్మ (7), అబిద్ ముస్తాక్ (2), అకిబ్ నబీ దార్ (0)లను పెవిలియన్‌కు పంపాడు.
మొత్తంగా షమీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఫలితంగా 20.4 ఓవర్లలో కేవలం 63 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ ఆలౌట్ అయింది. కాగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ, ముకేశ్ కుమార్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరం కాగా.. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలైలో చివరగా భారత జట్టుకు ఆడాడు.


