టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
వాగ్యుద్ధం
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar).. షమీ ఫిట్‌నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు పూర్తి ఫిట్‌గా లేడని.. అందుకే ఈ టూర్‌కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తనకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవని.. రంజీల్లో ఆడుతున్న వాడిని వన్డేల్లో ఆడలేనా? అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇందుకు ప్రతిగా అగార్కర్.. మరోసారి తన మాటకు కట్టుబడే ఉన్నానంటూ.. షమీ పూర్తి ఫిట్‌గా లేడని పునరుద్ఘాటించాడు. అయితే, షమీ (Mohammed Shami) కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలతో పాటు.. ఆటతోనూ సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమనే సంకేతాలు వచ్చాయి.
అయితే, తాజాగా బీసీసీఐ (BCCI) వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. షమీ గురించి సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నమెంట్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. షమీని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఇంకా పోటీలోనే ఉన్నాడు
ఈ మేరకు.. ‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ గురించి తరచూ చర్చ నడుస్తుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. అయితే, అతడి ఫిట్‌నెస్ గురించే బోర్డుకు ఆందోళనగా ఉంది. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ అతడు.
కివీస్‌తో సిరీస్‌కు.. వరల్డ్‌కప్‌కూ ఎంపిక కావొచ్చు!
అలాంటి ఆటగాడు సెలక్షన్ రాడార్‌లో లేకపోవడం అనే మాటే ఉండదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అతడి ఆట మెరుగ్గా సాగుతోంది. ఒకవేళ ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
షమీ అనుభవజ్ఞుడైన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయగలడు. 2027 వరల్డ్‌కప్ జట్టుకూ అతడు ఎంపికయ్యే అవకాశం లేకపోలేదు’’ అని బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో పేర్కొన్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాడు.
మెరుగైన ప్రదర్శన
ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో తొమ్మిది వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బెంగాల్ తరఫున దేశీ క్రికెట్లో రంజీల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ప్రస్తుతం దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.
చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం


