టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.
సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.
అయితే, ఈ రెండు మ్యాచ్‌లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్‌తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్‌లలో ఆడనున్నాడు.
విశ్రాంతి తీసుకోమన్నా వినడే!
టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్‌మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్‌తో ఐదు టీ20లు సహా వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.
రో-కో ఆడేశారు
కాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు.
ఇక శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్ తదుపరి మ్యాచ్‌లలో పంజాబ్‌కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.
చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?


