భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ పేసర్ జోష్ టంగ్‌కు చోటు దక్కింది. టంగ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఒక్క వైట్‌బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు.
యాషెస్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టంగ్‌ను వైట్‌బాల్ జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా వరల్డ్‌కప్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆర్చర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.
ఈ జట్టులో జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియమ్ లివింగ్‌స్టోన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆల్‌రౌండర్లగా కుర్రాన్, డాసన్, విల్ జాక్స్‌కు అవకాశం దక్కింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లండ్.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు టీ20, వన్డే సిరీస్‌లలో తలపడనుంది.
ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు కూడా ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా లంకతో టీ20లకూ కొనసాగించారు. ఆర్చర్ ఒక్కడే అందుబాటులో లేడు. అయితే వన్డే జట్టులో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. జనవరి 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్‌కప్ షూరూ కానుంది.
ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
శ్రీలంకతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
శ్రీలంకతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్.


