సాక్షి, తాడేపల్లి: ఈ ఏడాది (2025)లో కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. మహిళలు, చిన్నారుల పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్టు షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు అట్టడుగుకు పడిపోయింది.
‘‘కేంద్ర హోంశాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మారలేదు. డీజీపీ స్థాయి వ్యక్తి మాటలు వింటుంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో 213 శాతం గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయి. నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను హత్య చేశారు. 1,450 మందిపై లైంగిక దాడులు జరిగాయి. 5 వేల మందిపై వేధింపులు జరిగాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు’’ అంటూ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మూడు పార్టీలు కలిసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఏ వర్గానికీ ప్రభుత్వం మేలు చేయలేదు. దోపిడీలో బంగ్లాదేశ్‌కు బాబుగా, శ్రీలంకకు చెల్లిగా మార్చారు. ఆవకాయ ఫెస్టివల్‌కి డబ్బులు ఉంటాయిగానీ, ఆడబిడ్డ పథకం అమలు చేయడానికి డబ్బుల్లేవా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.
‘‘మహిళలంటే సామాన్య మహిళలే కాదు, దేవతలను కూడా అవమానం చేశారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేసి అవమానం చేశారు. అనిత, సంధ్య, సవిత.. ఈ ముగ్గురికే న్యాయం జరిగింది. పేరుకే మంత్రులు, కానీ జగన్‌ని దూషించటానికే పని చేస్తున్నారు. హోంమంత్రి అనిత రౌడీలకు పెరోల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తే తిరిగి బాధితురాలి మీదనే కేసు పెట్టించారు. మంత్రి సవిత కుట్టు మిషన్ల స్కాం చేసి సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం లోనే చూస్తున్నాం

..సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే వారిపైనే కేసులు పెట్టటం అన్యాయం. జల్సా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జనసేన, టీడీపీ కార్యకర్తలు అవాంఛనీయ శక్తులుగా వ్యవహరించారు. జగన్, అల్లు అర్జున్‌లను కించపరిచే మాస్కులు వేసుకుని వ్యవహరించారు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.


