బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 26 శాతం తగ్గి రూ.174 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.233 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం ఈ కాలంలో 2 శాతం తగ్గి రూ.4,364 కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో లాభం రూ.448 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభం రూ.454 కోట్లతో పోల్చి చూస్తే ఒక శాతం తగ్గింది. జీఎస్‌టీ (GST) రేట్ల మార్పు ప్రభావం సెప్టెంబర్ త్రైమాసికం పనితీరుపై ప్రభావం చూపించినట్టు కంపెనీ తెలిపింది.
బ్యాటరీలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని గుర్తు చేసింది. రేట్లు తగ్గిన తర్వాత కొత్త స్టాక్‌ను తెప్పించుకుందామని భాగస్వాములు భావించడంతో డిమాండ్ స్తబ్దుగా ఉన్నట్టు వివరించింది. లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ నిర్మాణం ఆశించిన విధంగా పురోగతిలో ఉన్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో అవిక్‌రాయ్ తెలిపారు.


