రుణభారంతో సతమతమవుతున్న 'వొడాఫోన్ ఐడియా'కు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా.. 2032 ఆర్థిక సంవత్సరం నుంచి 2041 ఆర్థిక సంవత్సరం వరకు.. 10 సంవత్సరాల కాలంలో వారి తిరిగి చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.
ఏజీఆర్ సంబంధిత అంశాలు.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ మద్దతు కోసం వేచిచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించింది.
వోడాఫోన్ ఐడియాలో.. ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి బకాయిల చెల్లింపును క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడమే కాకుండా.. కంపెనీకి చెందిన 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.


