దేశీయ టెలికాం రంగంలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వొడాఫోన్ ఐడియా (Vi)కు ప్రభుత్వం కల్పించిన భారీ ఊరట నేపథ్యంలో ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్, టాటా గ్రూప్ సంస్థలు కూడా తమ ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఉపశమనం కోరాలని భావిస్తున్నాయి.
సమాన అవకాశాలుండాలంటూ..
వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్ చెల్లింపులపై 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం (Moratorium) లభించడంతో దాదాపు రూ.87,695 కోట్ల బకాయిలు 2035 వరకు వాయిదా పడ్డాయి. ఒకే రంగంలో ఉన్న ఒక ఆపరేటర్‌కు ఇటువంటి ప్రత్యేక వెసులుబాటు కల్పించినప్పుడు అదే నిబంధనలను తమకు కూడా వర్తింపజేయాలని ఎయిర్‌టెల్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ (TTSL), టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (TTML) వాదిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంస్థలు త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంది. అవసరమైతే న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బకాయిల వివరాలు ఇలా..
భారతీ ఎయిర్‌టెల్ సుమారు రూ.48,103 కోట్లు, టాటా గ్రూప్ (TTSL, TTML) సుమారు రూ.19,259 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీలు 2021లో ప్రభుత్వం ఇచ్చిన నాలుగేళ్ల మారటోరియం ముగిసిన తర్వాత 2026 ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి తమ బకాయిల చెల్లింపులను పునప్రారంభించాల్సి ఉంది. ఒకవేళ వీరికి ఉపశమనం లభించకపోతే, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే తమపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది మార్కెట్ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు వైఖరి
నవంబర్ 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఈ వ్యవహారంలో ప్రాధాన్యత సంతరించుకుంది. వొడాఫోన్ ఐడియాను గట్టెక్కించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇటువంటి నిర్ణయాలు ఇతర కంపెనీల నుంచి కూడా డిమాండ్లకు దారితీస్తాయని కోర్టు అప్పుడే వ్యాఖ్యానించింది.
కీలక అంశాలు
భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం సుమారు 40 శాతం మార్కెట్ వాటాతో లాభాల్లో ఉంది. వొడాఫోన్ ఐడియా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నందున దానికి ప్రత్యేక మద్దతు లభించింది. కంపెనీల ఆర్థిక స్థితిగతులు వేర్వేరుగా ఉన్నప్పుడు ఒకే వెసులుబాటు వర్తిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంది.
వొడాఫోన్ ఐడియా మనుగడ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎయిర్‌టెల్, టాటా గ్రూపులకు బలమైన అస్త్రంగా మారింది. ప్రభుత్వం వీరికి కూడా గడువు పొడిగిస్తే టెలికాం కంపెనీల వద్ద నగదు లభ్యత పెరిగి 5జీ నెట్‌వర్క్ విస్తరణ వేగవంతం కావచ్చు. లేదంటే ఈ వివాదం మరోసారి న్యాయస్థానాల మెట్లు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.
ఏజీఆర్ అంటే?
దేశంలోని టెలికాం కంపెనీలు (ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటివి) తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఫీజుల రూపంలో చెల్లించాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.
లైసెన్స్ ఫీజు: సుమారు 8 శాతం.
స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు: సుమారు 3-5 శాతం.
ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు?


