భారతీయ టెలికాం వినియోగదారులకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక షాకిచ్చే వార్తను అందించింది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.
ఎంత పెరగవచ్చు?
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. 2026 నాటి పెంపుతో ఒక వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరగాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
టారిఫ్‌లు పెంచడానికి కారణాలు
దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఈ పెట్టుబడులపై రాబడిని (ROI) రాబట్టడం ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం’(ARPU) కనీసం రూ.300 దాటాలని సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 - రూ.210 స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర రుణాలను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరం.
సామాన్యులపై ప్రభావం
నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ టారిఫ్ పెంపు భారంగా మారనుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. 20% పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. డేటా ఖరీదైనదిగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం ఉంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడం మానేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చు.
ఇదీ చదవండి: రైల్వే వాలెట్ నుంచి నగదు విత్‌డ్రా కుదరదు


