భారత కార్పొరేట్ రంగంలో 2000 సంవత్సరం తర్వాత స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో సంప్రదాయ వ్యాపార దిగ్గజాలను వెనక్కి నెట్టి టెక్ ఆధారిత స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్-200 వ్యాపారవేత్తల జాబితా 2025’లో జొమాటో మాతృసంస్థ ఎటర్నెల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు.
ఇప్పటివరకు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి పరిమితం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎటర్నెల్ మార్కెట్ విలువ 27 శాతం వృద్ధి చెంది రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ 13 శాతం క్షీణించి రూ.3 లక్షల కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తున్న జొమాటో నెట్‌వర్క్ దీపిందర్‌ను ఈసారి జాబితాలో మొదటిసారి నిలపడమే కాకుండా నేరుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.
తొలి ప్రయత్నంలోనే మూడో స్థానం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ ఈ జాబితాలో తొలిసారి చోటు సంపాదించి ఏకంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి సంస్థ ‘ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్’ మార్కెట్ విలువను రూ.2.2 లక్షల కోట్లుగా హురున్ లెక్కగట్టింది. విమానయాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.
టాప్-10 సెల్ఫ్‌మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ 2025
| ర్యాంక్ | వ్యాపారవేత్తలు | కంపెనీ పేరు |
|---|---|---|
| 1 | దీపిందర్ గోయల్ | ఎటర్నెల్ (జొమాటో) |
| 2 | రాధాకృష్ణ దమానీ | డీమార్ట్ |
| 3 | రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ | ఇండిగో |
| 4 | అభయ్ సోయి | మ్యాక్స్ హెల్త్ కేర్ |
| 5 | శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి | స్విగ్గీ |
| 6 | దీప్ కర్లా, రాజేశ్ మాగౌ | మేక్ మై ట్రిప్ |
| 7 | యాశిష్ దహియా, అలోక్ బన్సల్ | పాలసీ బజార్ |
| 8 | విజయ్ శేఖర్ శర్మ | పేటీఎం |
| 9 | ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్ | నైకా |
| 10 | పీయూష్ బన్సల్ & టీమ్ | లెన్స్‌కార్ట్ |


