
నేడు జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం
‘అన్నీ తెలిసిన వారు ఉండరు.అలాగే ఏమీ తెలియని వారూ ఉండరు’ అనేది సామెత. ‘నీకు తెలిసిందే నీ శక్తి’ అనేది నీతికథ. జిమ్మి రాజుకు అంతర్జాతీయ వ్యాపారాల గురించి తెలియదు కానీ పచ్చళ్ల గురించి బాగా తెలుసు. ‘గ్రాండ్‌మా’ పేరుతో పచ్చళ్ల కంపెనీ ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయింది. ఒకప్పుడు కేరళలోని త్రిసూర్‌కే పరిమితమైన ఆ కంపెనీ ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కూడా సత్తా చాటుతోంది. జిమ్మి రాజు మాత్రమే కాదు ఘనమైన వ్యాపార నేపథ్యం లేని ఎంతోమంది సాధారణ మహిళలు చిన్న చిన్న అడుగులు వేస్తూనే ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా పెద్ద స్థాయికి చేరుకున్నారు.
గ్రాండ్‌మా..గ్రాండ్ సక్సెస్
‘నేను వ్యాపారవేత్త కాగలనా?’ తనకు తాను ప్రశ్న వేసుకుంది జిమ్మి రాజు. ‘కచ్చితంగా!’ తనలో నుంచే సమాధానం వచ్చింది. ‘నాకు ఏం తెలుసు?’ మరో ప్రశ్న.
‘పెద్దగా ఏమీ తెలియనక్కర్లేదు. నడిచే దారిలో అన్నీ తెలుస్తాయి’ ఆ ప్రశ్నకు జవాబు.
తనకు పచ్చళ్లు అంటే ఇష్టం. ఆసక్తి. ‘యస్...పచ్చళ్లతోనే మొదలెడదాం’ అనుకొని ప్రయాణం ప్రారంభించింది జిమ్మి రాజు. కేరళలోని మరడీలో ‘గ్రాండ్‌మా’ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించింది. ‘గ్రాండ్‌మా’ గ్రాండ్ సక్సెస్‌కు కారణం నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్లు. ‘గ్రాండ్‌మా’ ఇంట గెలిచింది. ఇప్పుడు రచ్చ గెలవాలి. వ్యాపారాన్ని విస్తరించాలంటే ముందు డబ్బు కావాలి. ‘ఫెడరల్ బ్యాంక్’ నుంచి లోన్ ద్వారా తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి, యూరోపియన్ దేశాల వరకు తీసుకువెళ్లింది జిమ్మి రాజు. ‘గ్రాండ్‌మా’ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇస్తోంది.
నష్టాల నుంచి లాభాలకు
పంజాబ్‌లోని మన్సాకు చెందిన కుల్విందర్ కౌర్ కుటుంబం డెయిరీ ఫామ్‌ను నిర్వహించేది. ఈ డైరీ వల్ల లాభాల మాటేమిటోగానీ నష్టాలే నష్టాలు! ‘ఇలా అయితే కుదరదు’ అని గట్టిగా అనుకున్న కుల్విందర్ ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని లోతుగా ఆలోచించింది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘మనీబాక్స్’ను సంప్రదించింది. ఈ కంపెనీ నుంచి అందిన రుణంతో డెయిరీని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. నష్టాల నుంచి బయటపడడానికి, లాభాల బాట పట్టి పెద్ద డెయిరీ ఫామ్ స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.
అమ్మ నేర్పిన విద్య
లక్ష్మి పది సంవత్సరాల వయసులో ఉన్నప్పడు తల్లి వినయ కేరళ, కొంకణి వంటకాలకు సంబంధించి చిన్నపాటి వ్యాపారాన్ని నిర్వహించేది. స్కూలు నుంచి రాగానే తల్లి చేసిన రకరకాల వంటకాలను రుచి చూసేది చిన్నారి లక్ష్మి. ప్యాకింగ్, డెలివరీకి సంబంధించిన పనుల్లో తల్లికి సహాయపడుతుండేది.
ఏళ్ల తరువాత... వినయ కోవిడ్ బారిన పడింది. అప్పుడు కూడా వైద్యులతో తన వ్యాపారం గురించి మాట్లాడేది. తల్లి చనిపోయి తరవాత విషాదంలో కూరుకుపోయింది లక్ష్మి. ఆ సమయంలోనే తన భవిష్యత్‌ని మార్చే నిర్ణయం తీసుకుంది.
‘అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటే వ్యాపారం ఆగకూడదు’ అనుకుంది. అలా ‘లక్ష్మి’ ఫుడ్ స్టార్టప్ మొదలైంది. రకరకాల వంటకాలకు సంబంధించి తల్లి రాసిన నోట్స్ తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మొదట్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌లకు సంబంధించిన సమస్యలు ఎదురైనా ఆ తరువాత మాత్రం కంపెనీని పెద్ద ఎత్తున విస్తరించింది.
‘అమ్మ మా వ్యాపారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని కలలు కనేది. ఆమె కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం. స్థానిక అమ్మకాలు, ఆన్‌లైన్ అమ్మకాలు, సోషల్ మీడియా మార్కెటింగ్‌తో అమ్మ కలను సాకారం చేశాం’
అంటుంది కేరళలోని త్రిసూర్‌కు చెందిన లక్ష్మి.
మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణా
కోవిడ్ కల్లోల కాలంలో దొరికిన విరామంలో ‘కొత్తగా ఏదైనా చేయాలి’ అని ఆలోచించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ సోనియ దాహియ. ఆ ఆలోచనలే ఫలితమే... పుట్టగొడుగుల పెంపకం. ఆమె నిర్ణయం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. ‘భద్రతను ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పుట్టగొడుగుల పెంపకం ఏమిటి!’ అని ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సోనియా. నలభై లక్షల రూపాయలతో ‘డాక్టర్ దాహియ మష్రూమ్ ఫామ్’ ప్రారంభించింది.
రోజు రోజుకూ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయింది. ఊహించని లాభాల స్థాయికి తీసుకువచ్చింది. అయితే మొదట్లో ఆమె ప్రయాణం సజావుగా ఏమీ జరగలేదు. తరచు విద్యుత్ కోతలుండేవి. ఆ ప్రభావం పుట్టగొడుగులపై పడేది. ఇదొక్కటే కాదు...ఎన్నో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను కనుక్కుంటూ వెళ్లిన సోనియ ‘మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణా’గా పేరు తెచ్చుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో సోనియాకు బయోటెక్నాలజీ నేపథ్యం ఎంతగానో ఉపయోగపడింది.
ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు
→ ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. నేను చెప్పే గెలుపు మంత్రం...‘అపజయం అనేది తాత్కాలికం’
→ ‘లింగ వివక్షత’ కనిపించకుండా చేసే శక్తి మన విజయానికి ఉంటుంది
→ ఎంటర్‌ప్రెన్యూర్ చేసే ప్రయాణం అనేది విరామమెరుగని నిరంతర ప్రయాణం
→ మీరు ఒక పని ఎంచుకుంటే, మీ జీవితం మొత్తం ఆ పని మీదే ఆధారపడినంతగా కష్టపడాలి
→ వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించడం అంటే బడిలో విద్యార్థిగా చేరడమే. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటాం.
– కిరణ్ మజుందార్–షా, బయోకాన్ వ్యవస్థాకురాలు