మధుర భాషణంతో యాంకర్‌గా రాణిస్తున్న ప్రసన్నలక్ష్మి
ఐదు భాషల్లో ఆకట్టుకునేలా వ్యాఖ్యానం
ఈవెంట్ ఆర్గనైజింగ్‌తో యాభై మందికి ఉపాధి..
ఎమ్మెస్సీ బీఈడీ చదివిన ఆమె.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు. తన మధుర స్వరం, సంభాషణ చాతుర్యం ఆమెను ముందుకు నడిపించాయి. వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. యాంకరింగ్ చేస్తూనే ఈవెంట్స్ నిర్వహణతో మరో యాభై మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డికి చెందిన ప్రసన్నలక్ష్మి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్‌లో జన్మనిచ్చిన ప్రసన్నలక్ష్మి కులకర్ణి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు విజయవర్ధన్‌తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్త, కుమారుడితో కలిసి పట్టణంలోని దేవి విహార్‌లో నివసిస్తున్నారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన ఆమె ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రెండుసార్లు డీఎస్సీ రాసినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లి ష్, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రావీణం ఉన్న ప్రసన్నలక్ష్మికి చదువుకునే సమయంనుంచి ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం, రాయడం అలవాట్లున్నాయి. అదే ఆమెకు బతుకుబాట చూపింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో ఏడేళ్ల క్రితం వ్యాఖ్యాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంచి గాత్రంతోపాటు సంభాషణ చాతుర్యం ఉన్న ఆమె ఈ రంగంలో సక్సెస్ అయ్యారు. వందలాది కార్యక్రమాల్లో ఆమె తన మాట, పాటలతో వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అధికారిక కార్యక్రమాల్లోనూ తనదైన యాంకరింగ్‌తో మెప్పిస్తున్నారు.
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో...
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఆట, పాటలతో అలరింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైనవన్నీ ఈవెంట్ ఆర్గనైజర్లే చూసుకుంటున్నారు. ప్రసన్నలక్ష్మి అన్నపూర్ణ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఈ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్... ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బుకింగ్స్ ఉంటున్నాయి. తమ సంస్థలో యాభై నుంచి అరవై మందికి ఉపాధి కలి్పస్తున్నామని ప్రసన్నలక్ష్మి తెలిపారు.
మాట, పాటలతో...
ప్రసన్నలక్ష్మి ఐదు భాషలలో మాట్లాడడంతో పాటు శ్రావ్యంగా పాటలూ పాడతారు. వీడియోలకు అవసరమైన వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. ఉద్యోగుల సన్మాన కార్యక్రమాలు, ఉద్యోగ విరమణ కార్యక్రమాలు, బదిలీ కార్యక్రమాలలో వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలను ప్రిపేర్ చేసి తన మాట, పాటలతో ఆహూతులను ఆకట్టుకుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో దాండియా, కోలాటం, బతుకమ్మ ఆటలు కూడా ఆడించడం ద్వారా అందరినీ ఉత్తేజపరుస్తుంటారు. తన వెంట ఉండే బృందంతో నృత్యాలు చేయిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.



