ఆభరణాల అలంకరణ ఇంటికీ వర్తిస్తుందని ఈ డిజైన్స్ చూస్తేనే అర్ధమవుతుంది. సంపన్నతకు అద్దం పట్టే ఈ జ్యూలరీ స్టైల్ డెకర్ ప్రత్యేక ఈవెంట్స్‌కు మరిన్ని హంగులను చేకూరుస్తుంది. సాధారణంగా కర్టెన్ అలంకరణ కిటికీలకు, గుమ్మాలకు స్టయిలిష్ టచ్‌ను జోడించడానికి ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఎంపికలో శ్రద్ధ కనబరచేవారు. ఇప్పుడు వాటి మీదుగా క్రిస్టల్ లేదా ముత్యాలు, రంగు రాళ్లు, ఇతర పూసలతో చేసిన డిజైన్లు టై–బ్యాక్‌లు, హోల్డ్‌బ్యాక్‌లు, రింగులు అంటూ కర్టెన్ ఆభరణాలు మరింత ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చేశాయి.
ముత్యాల వరస
వాడుకలో ఇవి ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కృత్రిమ ముత్యాలు లేదా పూసల వరుసలు ప్లెయిన్ కర్టెన్లకు మరింత హంగునిస్తాయి.
క్రిస్టల్ వెలుగులు
కొన్ని డిజైన్లలో కాంతిని ఆకర్షించడానికి, గది అలంకరణకు విలాసవంతమైన అనుభూతిని జోడించడానికి వివిధ పూసలు, స్ఫటికాలు లేదా రైన్‌స్టోన్‌లు మంచి మెరుపునిస్తాయి.
లోహాల ధగధగలు
అందమైన డిజైన్‌లతో లోహపు ఆభరణాలను కర్టెన్లు ఉన్న గోడలకు సెట్ చేస్తారు. కొన్నిసార్లు బంగారం లేదా వెండి లోహాలతో పూసలు, క్రిస్టల్స్ జత చేసినవీ ఇంటికి ధగధగలనిస్తాయి
హుక్ రింగ్స్
కర్టెన్ హార్డ్‌వేర్ కూడా ‘నగల‘ సౌందర్యంతో అందుబాటులోకి ఉంటున్నాయి. మెటల్ లేదా ప్లాస్టిక్‌లో ఇవి లభిస్తాయి. ఈ రింగులు బంగారం, వెండి, రాగి లోహాలతో ఉంటాయి. వీటికి డిజైనర్లు ఆభరణాల హంగులన్నీ అద్దుతున్నారు.
ఈ ఆభరణాలు కర్టెన్ రాడ్ చివరన, డ్రేప్‌లపైన సెట్ చేస్తారు. వీటిలో ఎన్నో డిజైన్ల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. లోహాలు, నాణ్యత, డిజైన్లను బట్టి వందల రూపాయల నుంచి ఎంత ఖరీదైనా తమ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకునే వీలు ఈ ‘నగలకు’ ఉంది.
– ఎన్నార్


