కథాకళి: వన్‌ బై టు | Funday On One Buy Two | Sakshi
Sakshi News home page

కథాకళి: వన్‌ బై టు

Dec 7 2025 11:02 AM | Updated on Dec 7 2025 11:02 AM

Funday On One Buy Two

గత ఆరేళ్ళుగా ఓ కార్పొరేట్‌ హాస్పిటల్లో నర్స్‌గా పని చేస్తున్న అద్విత ఆరోజు అంబులెన్స్‌లో ఓ ఫామ్‌ హౌస్‌కి వెళ్ళింది. ఆ ఇంటి సర్వెంట్‌ మెయిడ్‌ చెప్పింది.‘‘అతను మా సార్‌ డ్రైవర్‌. వెనక ఔట్‌ హౌస్‌లో ఉంటాడు. కారు సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్ళి చూస్తే, అపస్మారకంగా కనిపించాడు. సార్‌కి చెప్తే మీకు ఫోన్‌  చేయమన్నారు.’’‘‘అతనికి ఎవరైనా ఉన్నారా?’’ ఆమె వెంట నడుస్తూ అద్విత అడిగింది.‘‘లేరు. బ్రహ్మచారి. ‘జీతం బానే వస్తుంది. పెళ్ళి చేసుకోలేదే’మని అడిగితే ఓ నవ్వు నవ్వుతాడు తప్ప జవాబు చెప్పడు.’’స్ట్రెచర్‌తో ఇద్దరు పేరామెడిక్స్‌ వారిని అనుసరించారు. సర్వెంట్‌ మెయిడ్‌ వాళ్ళని ఫామ్‌ హౌస్‌ వెనక ఉన్న పెంకుటింటికి తీసుకెళ్ళింది. 

అద్విత ఇనుప బద్దీలకి అల్లిన ప్లాస్టిక్‌ నవారు మంచం మీది సన్నటి పరుపు మీద స్పృహలో లేని రోగిని, ఓ మూల ఉన్న డంబెల్స్‌ని చూసింది.‘‘ఇతని వయసు తెలుసా?’’ అద్విత అతని బీపీని చూస్తూ అడిగింది.‘‘రాబోయే నెలకి ముప్ఫై ఒకటి వస్తాయి అనుకుంటా.’’‘‘బీపీ బాగా పడిపోయింది. హార్ట్‌ ఎటాక్‌. గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్‌ చేయాలి.’’ స్టెతస్కోప్‌తో అతని గుండె చప్పుడుని విని, అతనికో ఇంజక్షన్‌  ఇచ్చి చెప్పింది.  ‘‘రోజూ ఎక్సర్‌సైజ్‌ చేస్తాడు. చెడ్డ అలవాట్లు లేవు. కాఫీ, టీలు కూడా తాగడు. టీ ఇస్తానంటే, ఒంటరిగా తాగను అంటాడు. ‘నాతో కలిసి తాగు’ అంటే నీతో కాదు అంటాడు. అయినా ఇదేం ఖర్మ?’’‘‘ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఓ రోగమే. చెడ్డ అలవాట్లు లేని కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌కి చిన్న వయసులోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి పోలా?’’

అంబులెన్‌ ్సలో వెళ్ళేప్పుడు అతను కళ్ళు తెరిచి చూసి మూసుకున్నాడు. కాని వెంటనే మళ్ళీ కళ్ళు తెరచి అద్వితని చూశాడు. అతని మొహంలో బలహీనమైన చిరునవ్వు. ఏదో మాట్లాడాడు. కాని అది వినపడకపోవడంతో ఆమె తన చెవిని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది.
‘‘నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.’’ బలహీనంగా వినిపించింది.‘‘ఫర్వాలేదు. భయపడక. నీకేం కాదు.’’ అతని భుజం తట్టి చెప్పింది.
‘‘నర్స్‌గా కాదు సంతోషం.’’హాస్పిటల్‌కి చేరుకున్నాక అతన్ని ఎమర్జెన్సీ రూమ్‌కి షిఫ్ట్‌ చేయడంతో అద్విత బాధ్యత పూర్తయింది.అరగంట తర్వాత ఓ నర్స్‌ వచ్చి చెప్పింది.

‘‘జూనియర్‌ డాక్టర్‌గారు నిన్ను రమ్మంటున్నారు.’’అక్కడికి వెళ్ళాక కార్డియాక్‌ మానిటర్‌ని చూసి, అతని గుండె ఎంత బలహీనంగా కొట్టుకుంటోందో గ్రహించింది.‘‘ఇతను నీతో మాట్లాడతాడట.’’‘‘మాట్లాడు.’’ ఆమె అతని నోటి దగ్గర తన చెవిని ఉంచి చెప్పింది.‘‘నర్సింగ్‌ కాలేజ్లో నేను బస్‌డ్రైవర్‌గా పని చేసేటప్పుడు నిన్ను చూశాను అద్వితా. రెండుసార్లు నీతో కలసి వన్‌ బై టు టీ తాగాలని ఉందని చెప్పాను. మూడోసారి నన్ను వేధించకు అన్నావు.’’‘‘ఓ. సారీ. నువ్వు నాకు గుర్తు లేదు.’’‘‘ఇప్పుడు నీతో కలిసి వన్‌ బై టు టీ తాగాలని ఉంది. ఆ టీ తాగుతూ ‘ఐ లవ్‌ యు’ అని చెప్పాలనుకున్నాను...’’ అతను రొప్పుతూ చెప్పాడు.

‘‘మాట్లాడకు.’’ అద్విత చెప్పింది. జూనియర్‌ డాక్టర్‌ వెంటనే కేంటీన్‌ కి ఫోన్‌  చేసి వన్‌  బై టు టీ తీసుకురమ్మని చెప్పాడు. అది వచ్చేలోగా మాటిమాటికీ కార్డియాక్‌ మానిటర్‌ని, తలుపుని చూడసాగాడు. టీ వచ్చాక అద్విత ఓ కప్పుని అతని నోటికి అందించింది. అతను ఓ గుక్క తాగి తను చెప్పాలి అనుకున్నది ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు.‘‘అతన్ని ముద్దు పెట్టుకో. తర్వాత ప్రశ్నలు.’’ జూనియర్‌ డాక్టర్‌ వెంటనే అరిచాడు.ఆమె ఆ పని చేస్తే సరిదిద్దాడు.

‘‘పెదవుల మీద.’’ఆమె అతని పెదవులని తన పెదవులతో చుంబించింది. అతను కళ్ళు తెరచి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుగు! క్రమంగా అది ఆరిపోయింది. మానిటర్‌లోని ఆకుపచ్చ గీత స్ట్రైట్‌ లైన్‌ గా మారింది. జూనియర్‌ డాక్టర్‌ అతని మొహం మీద దుప్పటిని కప్పాడు.రెండు కన్నీటి చుక్కలు ఆ టీ కప్పుల్లో పడ్డాయి.‘‘ఇతను నిన్ను ప్రేమించాడని తెలిస్తే మన పెళ్ళి జరిగేది కాదేమో!’’ జూనియర్‌ డాక్టర్‌ అద్వితతో చెప్పాడు.∙∙ అద్విత టీ తాగటం మానేసింది. పూర్తిగా. ఒంటరిగా కూడా. 

∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే 
ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
భాగస్వాములను చేయనున్నారు. 
మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో 
ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement