బడ్జెట్‌ భావుకత | ‘Budget as Poetry’: When India’s Budget speeches echoed literary greatness | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ భావుకత

Feb 1 2026 11:03 AM | Updated on Feb 1 2026 11:31 AM

‘Budget as Poetry’: When India’s Budget speeches echoed literary greatness

ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్‌ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్‌ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్, ఇక్బాల్‌ల కవిత్వం.. ఇలా ఎందరో సాహితీవేత్తల ఉల్లేఖనాలు మన ఆర్థిక ప్రణాళికా ప్రసంగాలకు ఆత్మగా నిలిచాయి. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రసంగ పాఠాలలో, మహనీయుల మాట ఎలా ఒక దిక్సూచిలా మారిందో.. ఆర్థిక మంత్రులు తమ దార్శనికతను సాహిత్యం ద్వారా ఎలా ప్రజల హృదయాలకు చేరవేశారో వివరించే ‘బడ్జెట్‌ కావ్యం’ ఇది. ఆస్వాదించండి.

సొగసైన వ్యక్తీకరణలు
భారత కేంద్ర బడ్జెట్‌ చరిత్రను పరిశీలిస్తే, ఆర్థిక మంత్రులు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సందర్భోచితమైన ‘గొప్ప మాటల’ ద్వారా ప్రభుత్వ దూరదృష్టిని, విజయాలను చాటిచెప్పడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చడానికి, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వీరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోట్స్‌ను ‘దన్ను’గా ప్రయోగిస్తుంటారు. చారిత్రక వ్యక్తులు మొదలుకొని, ప్రసిద్ధ కవులు, రచయితల వరకు వైవిధ్య భరితమైన మూలాల నుండి ఆ కోట్‌లను స్వీకరిస్తారు. ప్రసంగంలోని తీవ్రతను బట్టి వాటి శైలి మారుతూ ఉంటుంది. అవి, దేశ ఆర్థిక గమనాన్ని సామాన్యులకు సైతం ప్రభావవంతంగా వివరించడానికి తోడ్పతాయి.

కభీ ఖుషీ కభీ ఘమ్‌
ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రసిద్ధ కవి ఇక్బాల్‌ కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పి. చిదంబరం తన బడ్జెట్‌ ప్రతిపాదనలకు తిరువళ్ళువర్, థోరో వంటి గొప్ప వ్యక్తుల విజ్ఞానాన్ని జోడించేవారు. ప్రణబ్‌ ముఖర్జీ ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞుడైన కౌటిల్యుడి సూత్రాల నుండి మార్గదర్శకత్వాన్ని పొందేవారు. కేవలం షేక్స్‌పియర్‌ లేదా వివేకానందుడి వంటి వారే కాకుండా; అమర్త్యసేన్, ఇందిరా గాంధీ వంటి వారి ప్రస్తావనలు కూడా ఆర్థిక నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను బలోపేతం చేయడానికి బడ్జెట్‌ ప్రసంగాలకు ఉపయోగపడ్డాయి. ఇక 2002 నాటి ప్రసంగంలో యశ్వంత్‌ సిన్హా ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ (కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు విచారం), ‘ఫిల్హాల్‌’ (క్షణికమైన) వంటి బాలీవుడ్‌ చిత్రాల పేర్లను సైతం ఉదహరించారు!

మొరార్జీ ఆశావాదం
1960వ, 70వ దశాబ్దాలలో భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో కూడా, ఆర్థిక మంత్రులు ఈనాటికీ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా 1967–68 బడ్జెట్‌ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ పేదరికంపై పోరాటం–మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య అత్యంత ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సరైన విధానాలను అనుసరిస్తే దేశ ఆర్థిక పురోగతికి ఒక మలుపు అవుతుందని ఆయన ఆశించారు. ‘‘రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నేను పూర్తి ఆశావాదంతో చూస్తున్నాను. నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే, ఈ ఏడాది.. ఆర్థిక పునరుజ్జీవనానికి నాంది అవుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.

మన్మోహన్‌ ఉర్దూ అద్దకం
1990వ దశాబ్దంలో భారతదేశం ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేసింది. అప్పటి ఆర్థిక మంత్రి, భవిష్యత్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. 18,650 పదాలతో నేటికీ అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచి ఉన్న తన 1991 నాటి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్‌ రాసిన భావగర్భితమైన కవితను ఆయన చదివారు.దాని భావం: ‘‘గ్రీకు, ఈజిప్షియన్, రోమన్‌ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మన గుర్తింపు ఇంకా సజీవంగా ఉంది. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఇంకా నిలబడగలిగామంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి.’’! అదే ప్రసంగంలో ఆయన విక్టర్‌ హ్యూగో రాసిన..‘‘సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. మరుసటి ఏడాది కూడా మన్మోహన్‌ మరో ఉర్దూ కవి ముజఫర్‌ రజ్మీ రాసిన మాటలను గుర్తుచేశారు. దాని అర్థం: ‘‘చరిత్రలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉన్నాయి, క్షణాల్లో జరిగిన పొరపాట్ల వల్ల శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.’’

జస్వంత్‌.. తీరం, తుఫాను
బీజేపీ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత్‌ సిన్హా, జస్వంత్‌ సింగ్‌ బడ్జెట్‌ ప్రసంగాలు కూడా కవితాత్మను ప్రతిఫలించాయి. 1999 నుండి 2003 వరకు ఆర్థికమంత్రిగా సేవలందించిన యశ్వంత్‌ సిన్హా.. బడ్జెట్‌ను సంప్రదాయానికి భిన్నంగా సాయంత్రం పూట కాకుండా, మధ్యాహ్నం పూట ప్రవేశపెట్టిన మొదటి మంత్రిగా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థలో రెండవ తరం సంస్కరణలు, వృద్ధి, సమానత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఒక కవితను పేర్కొన్నారు.దాని తాత్పర్యం: ‘‘సమయం మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతోంది. తీరం వెంబడి సురక్షితంగా ఎంతకాలం నడుస్తూ వెళ్తాం?’’ (సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం).అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలో, యశ్వంత్‌ సిన్హా తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జస్వంత్‌ సింగ్, ప్రభుత్వ చివరి సంవత్సరాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలో సామాన్యుల అవసరాలకు పెద్దపీట వేస్తూ – ‘‘పేదవాడి కడుపులో ఆహారం, గృహిణి కొంగులో ధనం ఉండాలి..’’ అన్నారు.

 గాలి మేడలు.. పునాదులు
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.చిదంబరం తన బడ్జెట్‌ ప్రసంగాల్లో మేధావుల మాటలను జోడించడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా తమిళ తాత్విక కవి తిరువళ్ళువర్‌ పట్ల ఆయనకు ఉన్న భక్తి, గౌరవం ప్రతి బడ్జెట్‌ ప్రసంగంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. తరచు ఆయన తిరువళ్ళువర్‌ రాసిన ప్రసిద్ధ ‘తిరుక్కురల్‌’ నుండి, ‘‘ఏది సరైనదో నీ విచక్షణకు స్పష్టంగా తెలిసినప్పుడు, దానిని పూర్తి దృఢ సంకల్పంతో, అలసత్వం లేకుండా సాధించాలి..’’ అనే మాటను ఉదహరించేవారు. 2006–07 మధ్యంతర బడ్జెట్‌ సమయంలో, భారతదేశ యువత కలలను, ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ‘‘మీరు గాలిలో కోటలు కట్టినట్లయితే, మీ శ్రమ వృథా కాదు. అవి ఉండాల్సిన చోటు అదే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ కోటల కింద బలమైన పునాదులను నిర్మించడమే..’’ అని హెన్రీ డేవిడ్‌ థోరో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్యాలను గుర్తు చేస్తూ, ‘‘మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. మన తలరాతను మనమే రాసుకుంటాము. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది. ఎవరైతే తమ పడవ తెరచాపలను తెరిచి ఉంచుతారో వారు ముందుకు వెళ్తారు. తెరచాపలు మూసి ఉంచిన వారు వెనుకబడిపోతారు. అది గాలి తప్పా? కాదు... మన విధిని మనమే నిర్మించుకుంటాము..’’ అని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చిదంబరం తన బడ్జెట్‌ ప్రసంగంలో నొక్కి చెప్పారు.

  అరుణ్‌ జైట్లీ.. పూలు–ముళ్లు
జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగాల్లో సందర్భోచితమైన సూక్తులను, కవితలను ప్రయోగిస్తూ ఆర్థిక విధానాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారు. 2017–18 బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన, ‘‘నా లక్ష్యం సరైనదై, గమ్యం నా కళ్ల ముందు ఉన్నప్పుడు.. గాలులు నాకు అనుకూలిస్తాయి, నేను ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను’’ అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే 2016–17లో, ‘‘చాంపియన్లు అనేవారు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, ఒక కల, ఒక దార్శనికత నుండి ఉద్భవిస్తారు..’’ అని ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడారు.  2014–15 బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన చేసిన, ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్‌’ అనే పద ప్రయోగం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ప్రతీకాత్మక నినాదంగా మారిపోయింది. ప్రధాని మోదీ ఘన విజయం తర్వాత అరుణ్‌ జైట్లీ తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, దేశ పరిస్థితులపై ఓ కవితను చదివారు. దాని భావం: ‘‘మనం కొన్ని పూలను పూయించగలిగాము, మరికొన్ని వికసించాల్సి ఉంది. కాని, తోటలో ఇంకా కొన్ని పాత ముళ్లు మిగిలే ఉన్నాయి.’’ 
2017లో, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి దేశాన్ని గట్టెక్కించే క్రమంలో, జైట్లీ ఒక శక్తిమంతమైన ఉర్దూ కవితను స్మరించారు. ‘‘పడవను నడిపేవారు ఓటమిని అంగీకరించి చుక్కానిని మాకు అప్పగించినప్పుడు, ప్రతి అలపైనా మాకు తుఫానులు, సుడిగుండాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో మేము నిరూపించాము, భవిష్యత్తులోనూ నిరూపిస్తాము.’’.

 సీతారామన్‌.. వేకువ పక్షులు
ఆర్థిక మంత్రులందరిలో నిర్మలా సీతారామన్‌ తన ఆలోచనలను, ప్రణాళికలను ఎంతో స్పష్టంగా స్వేచ్ఛగా వ్యక్తపరచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె తన ప్రసంగాల్లో రవీంద్రనాథ్‌ ఠాగూర్, పండిట్‌ దీనానాథ్‌ కౌల్, ప్రసిద్ధ మహిళా సాధ్వి అవ్వయ్యార్, కాళిదాసు, పిసిరాంతైయార్‌ వంటి వైవిధ్యభరితమైన మేధావుల నుండి తన బడ్జెట్‌ ప్రసంగానికి స్ఫూర్తిని అందుకొంటుంటారు. ఆమె ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ ప్రసంగం ప్రధానంగా ‘‘ఆకాంక్షల భారతం, ఆర్థిక అభివృద్ధి, బాధ్యతాయుతమైన సమాజం’ అనే అంశాల చుట్టూ సాగింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని వివరిస్తూ, ఆమె ఉర్దూ రచయిత మంజూర్‌ హష్మీ రాసిన ఒక కవితను పఠించారు. ‘‘నీపై నీకు నమ్మకం ఉంటే, ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ఆ గాలిని అడ్డుగా పెట్టుకుని కూడా దీపం వెలుగుతుంది..’’ అని ఆ కవిత భావం. 

నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌ ప్రసంగంలో చాణక్య నీతి గురించి చెబుతూ, పట్టుదలతో కూడిన కృషి గురించి మాట్లాడారు. ‘‘మనుషులు దృఢ నిశ్చయంతో శ్రమిస్తే, అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని ఆ నీతి భావం. అలాగే, 2020 కేంద్ర బడ్జెట్‌ ప్రారంభోపన్యాసంలో.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత, భారతదేశ ఐక్యతను చాటి చెప్పడానికి కశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్‌ దీనానాథ్‌ కౌల్‌ రాసిన కవితను ఆమె చదివారు. ‘‘మన దేశం వికసించిన శాలిమార్‌ తోట వంటిది, దాల్‌ సరస్సులో విరిసిన తామర పువ్వు వంటిది, యువత ఉడుకు రక్తంలా శక్తిమంతమైనది. నా దేశం, నీ దేశం, మన దేశం.. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన దేశం’’ అని ఆ కవిత భావం. ఇక 2021లో, కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన చీకటి నీడల నుండి దేశం కోలుకుంటున్న తరుణంలో, ఆశావాదాన్ని నింపడానికి ఆమె.. ‘‘తెల్లవారుజాములో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, వెలుగును ముందే పసిగట్టి పాట పాడే పక్షి వంటిదే నమ్మకం’’.. అనే రవీంద్రనాథ్‌ టాగోర్‌ కోట్‌ను జ్ఞప్తికి తెచ్చారు.చూడాలి, నేడు (1 ఫిబ్రవరి 2026) నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏ ప్రాచీన కవులు, రచయితలు, తత్త్వవేత్తలు, ఆమెతో పాటుగా ‘ప్రసంగిస్తారో’!


మొత్తంమ్మీద ఇలా, బడ్జెట్‌ అంకెల్లో ఎన్నో అక్షర నక్షత్రాలు మెరిశాయి. భారతదేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్‌’ అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది దేశ ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకు ప్రతిరూపం. లోక్‌సభ వేదికపై ఆర్థిక మంత్రులు ప్రసంగిస్తున్నప్పుడు, ఆ అంకెల ప్రవాహంలో అకస్మాత్తుగా ఒక ఉర్దూ శాయరీయో, సంస్కృత శ్లోకమో లేదా ఒక స్ఫూర్తిదాయక కవితో మెరిసి.. సభలోని వారినే కాదు, యావద్దేశాన్నే మంత్రముగ్ధులను చేస్తుంటాయి. జమాఖర్చుల ప్రసంగ పాఠానికి మనోరంజకమైన జీవిత సత్యాల కవితాత్మక జోడింపు ఇది. 
 

ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్‌ ప్రసంగాల్లో ఉపయోగించిన కొన్ని సూక్తులు
సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు.  
– డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌

మన దేశం వికసించిన శాలిమార్‌ బాగ్‌ లాంటిది, దాల్‌ సరస్సులో విరిసిన తామర పువ్వు లాంటిది; ఇది యువత ఉడుకు రక్తం లాంటిది, నా దేశం, నీ దేశం, ప్రపంచం ప్రేమించే అత్యంత ప్రియమైన దేశం.
– నిర్మలా సీతారామన్‌

పరిస్థితులు మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతున్నాయి. తీరం వెంబడి ఎంతకాలం నడుస్తూ వెళ్తాం? 
– యశ్వంత్‌ సిన్హా

లక్ష్యం స్పష్టంగా ఉండి, గమ్యం కళ్లముందు ఉన్నప్పుడు.. గాలులు కూడా నాకు అనుకూలించి, నేను ఎత్తుకు ఎగురుతాను.; ‘‘ఛాంపియన్లు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, కల.. ఇంకా వారి దార్శనికత నుండి పుడతారు.’’ 
– అరుణ్‌ జైట్లీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement