ఇసుక బ్యాటరీ | Loviisan Lampo has commissioned the world largest Sand Battery | Sakshi
Sakshi News home page

ఇసుక బ్యాటరీ

Feb 1 2026 12:35 AM | Updated on Feb 1 2026 12:35 AM

Loviisan Lampo has commissioned the world largest Sand Battery

ఆధునిక గడియారాలు అందుబాటులో లేకముందు ఇసుక గడియారాలను వాడేవారు. కాని, అధునాతన లిథియం అయాన్‌ బ్యాటరీలు కూడా అందుబాటులోకి వచ్చాక ఈ ఇసుక బ్యాటరీ తయారు కావడం వింతగా ఉంది కదూ! నిజానికి ఇది లిథియం అయాన్‌ బ్యాటరీల కంటే అధునాతనమైనది, అత్యంత సమర్థమైనది కూడా! ఫిన్నిష్‌ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ ఇసుక బ్యాటరీని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇసుక బ్యాటరీ. ఈ బ్యాటరీ సామర్థ్యం తెలుసుకుంటే, నోరెళ్లబెట్టాల్సిందే!

ఈ బ్యాటరీతో ఏకంగా ఐదువేలకు పైచిలుకు ఇళ్లు గల ఒక చిన్న పట్టణానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలుగుతున్నారు. పోర్నాయినెన్‌ అనే పట్టణంలో ప్రయోగాత్మకంగా దాదాపు యాభై అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ ఇసుక బ్యాటరీని నెలకొల్పారు. ‘లోవీసన్‌ ల్యాంపో’ అనే కంపెనీ శాస్త్రవేత్తల సహాయంతో ఈ ఇసుక బ్యాటరీని తయారు చేసి, ఈ పట్టణంలో నెలకొల్పింది. పొడిగా చితక్కొట్టిన రాళ్లను ఇసుకగా మార్చి, దానిని విపరీతంగా వేడి చేయడం ద్వారా ఈ బ్యాటరీని రూపొందించారు.

అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడెక్కిన ఇసుక దీర్ఘకాలం పాటు వేడిని నిక్షిప్తం చేసుకుని, విద్యుత్తు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఎంత విద్యుత్‌ సరఫరా ఉన్నా, ఫిన్లండ్‌లో శీతకాలమైతే చాలు, ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కట్టెల వినియోగం కూడా తప్పనిసరి. అయితే, ఈ ఇసుక బ్యాటరీ వల్ల పోర్నాయినెన్‌ పట్టణంలో ఈ శీతకాలంలో కట్టెల వినియోగం దాదాపు అరవైశాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఫిన్లండ్‌ తన విద్యుత్తు వినియోగంలో 43 శాతం మేరకు పునర్వినియోగ ఇంధనాల ద్వారానే పొందుతోంది. పునర్వినియోగ ఇంధనాలను మరింతగా పెంచడం ద్వారా 2035 నాటికల్లా పూర్తిగా పర్యావరణ హితమైన విద్యుత్తునే దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని ఫిన్లండ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement