పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు కర్దమ మహర్షి కుమార్తెను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మృగశృంగుడని నామకరణం చేశారు. కుత్సురుడు కుమారుడికి ఐదో ఏట ఉపనయనం చేశాడు. ఆ బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించి, తండ్రి వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. కొంతకాలానికి అతడు యుక్తవయసుకు వచ్చాడు. దేశాటనకు పోవాలనే కోరికతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని, ఇంటి నుంచి బయలుదేరాడు. మృగశృంగుడు దేశాటన సాగిస్తూ, మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ కొన్నాళ్లకు మాఘమాసం సమీపిస్తుండగా, కావేరీ తీరానికి చేరుకున్నాడు.
‘ఏమి నా భాగ్యం! మాఘమాసంలో కావేరీ స్నానమాచరించే అవకాశం దొరికింది. మాఘమాసం అంతా ఇక్కడే బస చేస్తాను’ అనుకుని మృగశృంగుడు సంతోషించాడు. నదీ తీరానికి చేరువలోనే ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండటం ప్రారంభించాడు. అతడి తపస్సుకు మెచ్చి ఒకనాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ‘ఓ విప్రకుమారా! నీ తపస్సుకు మెచ్చాను. పవిత్ర మాఘమాసంలో విడువకుండా కావేరీస్నానం సాగిస్తూ వచ్చినందుకు నీ పుణ్యం రెట్టింపైంది. నీకేం కావాలో కోరుకో, తప్పకుండా నెరవేరుస్తాను’ అన్నాడు శ్రీహరి. ‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! నీ దర్శనమాత్రంతోనే నా జన్మ ధన్యమైంది. నాకింకే ఐహిక కాంక్షలూ లేవు. నాకు ఎలా దర్శనమిచ్చావో, ఇదేచోటు కొలువుండి నీ భక్తులకు దర్శనమివ్వు. ఇది చాలు నాకు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి అతడి కోరికను మన్నించి అదేచోట కొలువై వెలిశాడు.
కొన్నాళ్లకు మృగశృంగుడు తల్లిదండ్రులను చూడటానికి స్వగ్రామం చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని చూసి సంతోషించారు. మృగశృంగుడికి వివాహం చేయాలని వారు భావించారు. ఇదే సంగతి అతడికి చెబితే, ‘ఆశ్రమాలన్నిటిలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్ఠమని దైవజ్ఞులు చెబుతారు. అయితే, భార్య గుణవతి, అనుకూలవతి అయినప్పుడే గృహస్థాశ్రమ ధర్మాన్ని సజావుగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. అలాంటి యువతి దొరికినప్పుడే వివాహం చేసుకుంటాను’ అన్నాడు. ‘కుమారా! నీ మాటలు సమంజసంగా ఉన్నాయి. నీ కోరిక తీరాలంటే, భగవంతుడైన శ్రీహరిపైనే భారం వేయాలి. నీ అభీష్టం నెరవేరుగాక!’ అన్నారు తల్లిదండ్రులు.
ఇలా ఉండగా, భోగాపురం అనే గ్రామంలో సదాచారపరాయణుడైన విప్రుడు ఉండేవాడు. అతడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అందాలరాశి. పేరుకు తగినట్లుగానే గుణవంతురాలు. దైవభక్తి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన సుశీల నిత్యం ఏదో ఒక వ్రతం చేపడుతూ, పురాణశ్రవణంతో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆమె గుణగణాలను తెలుసుకున్న మృగశృంగుడు ఆమెనే పెళ్లాడదలచాడు.
ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి కావేరీ స్నానానికి బయలుదేరింది. అకస్మాత్తుగా ఒక ఏనుగు అటువైపు వచ్చి, ఆ ముగ్గురు యువతులను తరమసాగింది. భయభ్రాంతులైన ఆ యువతులు దిక్కుతోచక పరుగు లంకించుకున్నారు. పరుగెడుతూ వారు ఒక దిగుడుబావిలో పడి మరణించారు. సంగతి తెలిసి హుటాహుటిన అక్కడకు చేరుకున్న వారి తల్లిదండ్రులు విగతజీవులైన కుమార్తెలను చూసి భోరున విలపించసాగారు.
మృగశృంగుడికి కూడా ఈ వార్త తెలియడంతో అతడు కూడా అక్కడకు చేరుకున్నాడు. వారిని ఎలాగైనా బతికించాలని సంకల్పించుకున్నాడు. తాను వచ్చేంత వరకు మృతదేహాలను చూస్తుండమని వారి తల్లిదండ్రులతో చెప్పి, నేరుగా కావేరి వద్దకు వెళ్లాడు. మెడలోతు నీళ్లలో మునిగి, ధ్యానం ప్రారంభించాడు. ఈలోగా ఆ యువతుల మరణానికి కారణమైన ఏనుగు అక్కడకు ఘీంకరిస్తూ వచ్చింది. మృగశృంగుడి ఎదుట నిలిచి, భీకరంగా ఘీంకరించింది. మృగశృంగుడు చలించలేదు. అది తదేకంగా అతడినే కాసేపు చూసింది. ఉన్నపళాన అతడిని తొండంతో చుట్టి పైకిలేపి, వీపుమీదకు ఎక్కించుకుంది. ఈ పరిణామాన్ని చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేయసాగారు. అయితే, మృగశృంగుడు చలించలేదు. పైగా దీనిని శుభసూచకంగా తలచాడు. ఏనుగు శరీరాన్ని నిమిరి, మంత్రజలాన్ని దానిపై చల్లాడు.
తక్షణమే ఏనుగు దేవతారూపం దాల్చి, మృగశృంగుడి ఎదుట నిలిచింది. తనకు శాపవిమోచనం కలిగించినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపి, స్వర్గానికి బయలుదేరింది. శాపవిమోచనం పొందిన ఏనుగు వెళ్లిపోయాక, విగతజీవులైన యువతులను బతికించాలనే సంకల్పంతో మృగశృంగుడు మళ్లీ కావేరిలోకి దిగి, యముడి గురించి ధ్యానం ప్రారంభించాడు. యమధర్మరాజు అతడి దీక్షకు సంతృప్తి చెంది, అతడికి ప్రత్యక్షమయ్యాడు.‘మృగశృంగా! నీ దీక్షకు సంతోషించాను. ఏంకావాలో కోరుకో, తప్పక నెరవేరుస్తాను’ అని పలికాడు.మృగశృంగుడు యమధర్మరాజును వేనోళ్ల స్తుతించి, విగతజీవులైన ముగ్గురు యువతులనూ పునర్జీవితులను చేయమని కోరాడు.యముడు ‘తథాస్తు’ అని పలికాడు.అప్పటివరకు విగతజీవులై పడి ఉన్న ఆ ముగ్గురు యువతులూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచారు. కొంతకాలానికి మృగశృంగుడు సుశీలను పెళ్లాడాడు.
∙సాంఖ్యాయన


