కథాకళి: విలన్‌ | Funday Story | Sakshi
Sakshi News home page

కథాకళి: విలన్‌

Feb 1 2026 11:47 AM | Updated on Feb 1 2026 11:47 AM

Funday Story

ఆ ఆదివారం, జనవరి పద్దెనిమిదిన ముప్ఫై రెండేళ్ళ ఏగ్నెస్‌ సెయింట్‌ ఫిలోమినా చర్చ్‌లోంచి బయటికి వచ్చి, మెట్రో స్టేషన్స్‌  దాకా నడిచింది. తన హేండ్‌బేగ్‌ తెరచి డబ్బు లెక్క చూసుకుని, కొద్దిసేపు ఆలోచించింది. ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలని అనుకుంటోది. వెళ్ళాక ఏదో కొనాలనిపిస్తుంది. కాని సరిపడా డబ్బు లేదు. ఆ ఆదివారం సాయంత్రం హాస్టల్‌కి వెళ్ళి గదిలో ఒంటరిగా గడపటానికి ఇష్టపడక ఆమె మెట్రో స్టేషన్స్‌ లోకి నడిచింది. ముప్పావు గంట తర్వాత ఆమె ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్స్‌ లోకి టికెట్‌ కొనుక్కుని వెళ్ళింది. ఒక్కో స్టాల్‌ని చూసుకుంటూ నడవసాగింది. ఆదివారం కాబట్టి అక్కడ బాగా రద్దీగా ఉంది.ఏగ్నెస్‌ మిరపకాయ బజ్జీల స్టాల్‌ దగ్గర ఆగింది. బయట అమ్మే ధర కన్నా ఒకోటి నాలుగు రెట్ల ధర. ఆకలిగా ఉండటంతో రెండు కొనుక్కొని తిన్నది. ఆమె తను ఏమేం కొనలేక పోతోందో స్టాల్స్‌లో చూసుకుంటూ సగం దూరం వెళ్ళాక అది జరిగింది. అకస్మాత్తుగా ఒకడు ఆమె హేండ్‌ బేగ్‌ని లాక్కుని పరిగెత్తాడు.

‘‘ఆగు. దొంగ. దొంగ.’’ ఆమె అరుస్తూ అతని వెంట పరిగెత్తింది.అతను మనుషుల్ని పక్కకి తోసుకుంటూ వేగంగా పరిగెత్తాడు. ఏగ్నెస్‌ ఆ రద్దీలో అతని వెంటపడి పట్టుకోలేకపోయింది. అతను ఎర్ర టీషర్ట్, జీన్స్‌ తొడుక్కున్నాడని మాత్రం గుర్తించింది. అతని వయసు పాతిక దాకా ఉండచ్చని అనుకుంది. కొందరు ఆమెని ప్రశ్నించసాగారు.‘‘దొంగని గుర్తుపట్టగలరా?’’‘‘ఎంతుంది?’’‘‘పోలీస్‌ పోస్ట్‌ ఎంట్రన్స్‌ గేటు పక్కన ఉంది. వెంటనే రిపోర్ట్‌ చేయండి.’’ ఓ ముసలాయన సలహా ఇచ్చాడు.ఆమె పాతిక అడుగులు వేశాక, ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి ఆ హేండ్‌బేగ్‌ని అందిస్తూ అడిగాడు.‘‘మీదే కదా ఇది?’’‘‘అవును. మీకు ఎలా దొరికింది?’’ ఏగ్నెస్‌ సంభ్రమంగా అడిగింది.‘‘మీ అరుపులు విన్నాను. వాడు నా ముందు నుంచే పరిగెత్తాడు. మీ అరుపులు విన్నాక మగాడి చేతిలో లేడీస్‌ హేండ్‌బేగ్‌ చూడగానే ఏం జరిగిందో గ్రహించి కాలు అడ్డుపెట్టాను. వాడు పడగానే దీన్ని లాక్కున్నాను. వెధవ. నా దవడమీద కొట్టి పారిపోయాడు.’’‘‘థాంక్స్‌ అండీ. మీరు నిజంగా హీరో.’’ ఏగ్నెస్‌ చెప్పింది.

‘‘విలన్స్‌  ఉంటేనే హీరో ఉంటాడు. ఏం పోలేదుగా? చూసుకోండి. ఐనా వాడికి దాన్ని తెరిచి కొట్టేసే సమయం లేదు లెండి.’’
‘‘ఇది బీద హేండ్‌బేగ్‌. అందులో హాస్టల్‌కి వెళ్ళడానికి సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కాకపోతే ఐడీ కార్డ్‌ గురించి నేను వర్రీ అయ్యాను.’’
‘‘మీ పేరు?’’‘‘ఏగ్నెస్‌.’’‘‘నేను అబిడ్స్‌లో మొబైల్స్‌ రిపేర్‌ షాప్‌ నడుపుతున్నాను.’’‘‘నైస్‌. థాంక్స్‌ అగైన్స్‌  అండీ. మీకు మిర్చిబజ్జీలు కొనిపెట్టాలని ఉంది. కాని అంత డబ్బు లేదు.’’ ఏగ్నెస్‌ నొచ్చుకుంటూ చెప్పింది.‘‘ఫర్వాలేదు. మీ బేగ్‌ జాగ్రత్త. బై.’’ చెప్పి అతను వెళ్ళిపోయాడు.ఆమెకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. తిరిగి మెట్రో స్టేషన్స్‌ కి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతోంది. టికెట్‌ కొనడానికి హేండ్‌బేగ్‌ని తెరిచి చూసి భృకుటి ముడివేసింది. అందులోంచి ఐదువందల రూపాయల నోట్ల కట్టని బయటికి తీసి చూసింది.ఏభై వేల రూపాయలు! ఇది తన హేండ్‌ బేగ్‌లోకి ఎలా వచ్చింది? ఆ దొంగ పెట్టి ఉంటాడు. ఎందుకు పెట్టినట్లు? బహుశా ఇంకెవరి దగ్గరో కొట్టేసింది తన బేగ్‌లో ఉంచి ఉంటాడనే ఆలోచన ఆమెకి కలిగింది.

ఇప్పుడు తనేం చేయాలి? పోలీసులకి జరిగింది చెప్పి ఆ డబ్బు ఇవ్వటం సబబు. కాని దాదాపు ప్రతి ఇండియన్స్‌ కి వచ్చే ఆలోచన దాన్ని రద్దు చేసింది. అది దాని యజమానికి కాక పోలీసుల జేబులోకి వెళ్ళే బదులు తనే వాడుకోవచ్చుగా?మెట్రోలో వెళ్తూ ఆ డబ్బుతో ఏం కొనాలో ఆలోచించింది. చాలా గుర్తొచ్చాయి. ముఖ్యంగా సిటీ సెంటర్‌ మాల్‌లో, జూడియోలో విండో షాపింగ్‌లో చూసిన గౌన్స్‌  గుర్తొచ్చింది. ఆమె కూకట్‌పల్లిలో మెట్రోలోంచి బయటికి వచ్చి, పది నిమిషాల దూరంలోని తన వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్‌కి నడవసాగింది. రోడ్‌లోంచి ఓ సందులోకి, అందులోంచి ఆట్టే రద్దీ లేని మరో చిన్న సందులోకి నడిచాక వినిపించింది.
‘‘హలో ఏగ్నెస్‌.’’

ఆమె తల తిప్పి చూస్తే, ఇందాక ఆ హేండ్‌ బేగ్‌ ఇచ్చిన వ్యక్తి పక్కనే నడుస్తూ కనిపించాడు.‘‘హలో. మళ్ళీ కలిశాం.’’ ఆశ్చర్యంగా చెప్పింది.‘‘ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లుగా నేను హీరోని కాను. విలన్స్‌ ని. ఆ డబ్బు ఇవ్వండి.’’ కఠినంగా చెప్పాడు.‘‘డబ్బు? ఏ డబ్బు?’’‘‘మెట్రో స్టేషన్స్‌  బయట దాన్ని తీసి చూసుకుని, మళ్ళీ నువ్వు హేండ్‌ బేగ్‌లో ఉంచిన ఏభైవేలు.’’ఆమె తెల్లబోతూ చూస్తూంటే అతను ఆమె హేండ్‌బేగ్‌ని అందుకుని అందులోంచి ఆ సొమ్ము తీసుకుని చెప్పాడు.‘‘వాడు నా తమ్ముడు. ఓ దుకాణంలో కేష్‌ బాక్స్‌లోంచి దాన్ని దొంగిలించాడు. పోలీసులు పట్టుకున్నా తన దగ్గర ఆ డబ్బు దొరకకూడదని దీన్ని నీ హేండ్‌బేగ్‌లో ఉంచి నాకు ఇచ్చాడు. నేను దాన్ని నీకు ఇచ్చాను.’’అతను ఆ డబ్బు తన జేబులో ఉంచుకుని వేగంగా వెళ్ళిపోతూంటే, ఏగ్నెస్‌ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది.  
 ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే 
ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
భాగస్వాములను చేయనున్నారు. 
మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో 
ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement