ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.
కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?
అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్‌లైన్‌లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.
గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్‌గా మార్కెట్‌లో దూసుకుపోతోంది..
తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్‌లలో, స్క్రీన్‌లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్‌బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..
🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్‌తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు.
😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్‌బాల్ స్పెషల్ ఈవెంట్స్‌లో పాస్‌తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్‌తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్‌తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.
👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది.
😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్‌లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్‌గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్‌ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు).
☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్‌సైట్‌ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్‌లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు.
🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్‌గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్‌బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్‌దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్‌లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి.


