సంరక్షణ
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ గొలుసులో బిగించిన జి.పి.ఎస్.ను యాక్టివేట్ చేసి ఆమెఆ దాపున ఉన్న ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉందని తెలుసుకున్నాడు. వయో వృద్ధులు తప్పి పోతే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మార్కెట్లో జి.పి.ఎస్. ట్రాకర్లు ఉన్నాయి. రోజులు బాగలేని ఈ కాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.
ముంబయికి చెందిన 79 ఏళ్ల సైరాబీ ఇటీవల ఒకరోజు ఈవెనింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు. చుట్టుపక్కలప్రాంతాలు వెతికినా కనిపించలేదు. సైరాబీని ఓ బైక్ గుద్దేయడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఒంటరిగా బయటకు వచ్చిన ఆమె వివరాలు అక్కడున్న ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె ఆచూకీ ఎక్కుడుందో ఇంటి వారిని పట్టిచ్చింది ఆమె మెడలో ధరించిన నెక్లెస్‌లోని జీపీఎస్.
మనవడి ముందు చూపు
వయసులో పెద్దవారు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. మార్గమధ్యంలో వారికేమైందని కలవరం మొదలవుతుంది. సైరాబీ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మనవడు మహమ్మద్ వసీం ఆమె వేసుకున్న నెక్లెస్‌లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. వృద్ధులు రకరకాల కారణాల వల్ల ఇల్లు విడిచి పెట్టి వెళుతుంటారు. లేదా దారి తప్పుతుంటారు.
అందుకే మనవడు ముందు చూపుతో ట్రాకర్ అమర్చాడు. ఆ పని మేలు చేసింది. మనవడు వెంటనే ట్రాకర్ స్విచ్ ఆన్ చేయగా, వారింటికి 5 కి.మీల దూరంలో ఉన్న కేఈఎమ్ ఆసుపత్రిని చూపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తలకు గాయమైందని, ఆరోగ్యం కుదురుగా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నిత్యం అనేకమంది వృద్ధులు తప్పిపోయి ఆచూకీకి దూరమవుతున్నారు. అటువంటి వారికి జీపీఎస్ ట్రాకర్ మేలు చేస్తోంది.
నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్
‘నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్’ ఇటీవల కాలంలో అనేకమందికి చేరువైంది. నగలకుండే లాకెట్‌ల లోపల ఇమడ్చగలిగే ఈ చిన్న పరికరం మనం ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తుంది. పైకి మామూలు నగలలాగే కనిపిస్తూ ఉండటం వల్ల అలంకరణకూ లోటూ ఉండదు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, మతిమరుపు కలిగినవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది చాలా ఉపకరించే పరికరం. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయినా, జరగరానిది జరిగినా, అపహరణకు గురైనా వెంటనే ఆచూకీ తెలుసుకోవచ్చు. ఒంటరిగా దూరప్రయాణాలు చేసేవారు, అడవి, కొండలు, ఎడారులు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పిపోకుండా వీటిని వినియోగించొచ్చు. ఏదైనా నేరాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా ఇవి పోలీసుశాఖకు మేలు చేయనున్నాయి.
ధరలు అందుబాటులోనే..
జీపీఎస్ ట్రాకర్ నెక్లెస్ ధరలు అందుబాటులోనే ఉంటాయి. బేసిక్ ట్రాకింగ్ నెక్లెస్ కనీస ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా ఉంటుంది. ఎక్కువ ఆప్షన్ ్స ఉన్న హైఎండ్ ట్రాకర్ కావాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది.


