
జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్లు అనుమానాలు
ఆ దిశగా సాగుతున్న దర్యాప్తు
సాక్షి, నేషనల్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌మ మొహోల్ సైతం చెప్పారు.
గ్లోబల్ పోజీషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్‌సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు.
పైలట్‌కు తప్పుడు సంకేతాలు
భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సి–130జే విమానం ఏప్రిల్‌లో మయన్మార్ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్‌చేశారు. జీపీఎస్ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్‌పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్‌లో ఇంటర్‌ఫియరెన్స్ రేటు 175 శాతం, జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్ లేదా జామింగ్ చేస్తే విమానం కాక్‌పిట్‌లోని పైలట్‌కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్‌వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు.
కల్లోలిత ప్రాంతాల్లో అధికం..
యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్ జామింగ్ లేదా స్పూఫింగ్ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్ సరిహద్దుల్లో స్ఫూపింగ్ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్‌తోపాటు భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో జీపీఎస్ స్ఫూపింగ్, జామింగ్ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.