
చెన్నై: త్రిభాషా సూత్రంపై తమిళనాట కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు నడుంబిగించింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.
న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం
ఇండియా టుడే వెల్లడించిన వివరాల ప్రకారం తమిళానాడు అంతటా హిందీ బోర్డులు, హోర్డింగ్‌లు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను త్వరలో నిలిపివేయనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రం అయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఒక బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం రూపకల్పనలోని న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు న్యాయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా..
ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నదని సమాచారం. హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా శాసనసభ ఇటీవల ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తమిళ భాషను కాపాడటమే లక్ష్యంగా..
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర రాష్ట్రాలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషగా కొనసాగుతుందని తెలిపారన్నారు. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదర్శనలలో అంటే హోర్డింగులు, బోర్డులు, వినోద ప్రదర్శనలు, సినిమాలు పాటలు ఈ తరహా మాధ్యమాలలో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని, తమిళ భాష గుర్తింపును కాపాడటమే లక్ష్యంగా బిల్లును రూపొందించనట్లు అధికారులు తెలిపారు.