
తుపాకీ చేతబూని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో మల్లోజుల కరచాలనం, తుపాకీ స్థానంలో రాజ్యాంగ ప్రతితో మల్లోజుల
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట లొంగిపోనున్న కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు
ఆయనతోపాటు జనజీవన స్రవంతిలోకి 60 మంది
ఉమ్మడి ఏపీలో కీలక ఆపరేషన్లలో ఆశన్న పాత్ర
బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోనే 78 మంది లొంగుబాటు
వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నేత రాజమన్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ హైదరాబాద్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత,కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. ఆయనతోపాటు దాదాపు 60 మంది వరకు లొంగిపోతారని సమాచారం.
వీరంతా ఇప్పటికే జగదల్‌పూర్‌కు చేరుకున్నట్లు చెబుతున్నారు. కీలక మహిళా మావోయిస్టు రణిత కూడా లొంగిపోయే వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. మరోవైపు బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు.
ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్‌మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది.
మల్లోజుల మార్గంలో..
శాంతిచర్చలపై ముందుగా అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సబ్‌జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్‌కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోతుండట గమనార్హం.
యాక్షన్లలో దిట్ట
తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ చౌరస్తాలో 1999 సెపె్టంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్‌కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్‌లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్‌లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేలి్చన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు.
వేర్వేరు లొంగుబాట్లు.. ప్లాన్‌లో భాగమే
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం కలిగించడానికే అగ్రనేతల లొంగుబాటు కార్యక్రమాలను వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఏపీ, తెలంగాణలో ఉనికి కోల్పోయింది. ఏఓబీలో వరుస ఎన్‌కౌంటర్లలో చలపతి, గాజర్ల గణేశ్, మోడెం బాలకృష్ణ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు చైతే వంటి మహిళా అగ్రనేతలు చనిపోయారు. ఇక ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధాకర్, మైలారపు ఆడేళ్లు చనిపోయారు.
జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ప్రయాగ్ మాంఝీ, అంజు సోరేన్ మృతి చెందారు. దీంతో దండకారణ్యం అందునా అబూజ్‌మడ్, దక్షిణ బస్తర్‌కే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. ఇక్కడ కూడా ఆ పార్టీ పట్టు కోల్పోయిందనే విషయం ప్రపంచానికి చాటేందుకే అబూజ్‌మాడ్‌లో మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మావోలంతా మల్లోజుల వెంట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే మాడ్ ఏరియాలో ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులంతా ఆశన్నతో కలిసి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అంతకు మూడు రోజుల ముందు దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు హైదరాబాద్‌లో లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతలంతా మాడ్ అడవుల్లోనే తలదాచుకు న్నారు. అక్కడి నుంచి సురక్షితంగా లొంగిపోవాలంటే వారి ముందున్న ప్రత్యామ్నాయాలు మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మాత్రమేనని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.