కూతురి ప్రేమికుడిని కడతేర్చిన కన్నవారు
ప్రియుడి శవాన్నే పెళ్లాడిన యువతి
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది.
చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్‌లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.
మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు
ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.
తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి..
గురువారం సాయంత్రం, నాందేడ్‌లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు.
మా ప్రేమకు చావు లేదు..
సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వారిని ఉరి తీయండి..
ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది.
‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


